ఆ బంగారంపై అన్నీ అనుమానాలే | Many Suspicions About 1381 Kgs Gold Caught In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆ బంగారంపై అన్నీ అనుమానాలే

Published Fri, Apr 19 2019 3:06 AM | Last Updated on Fri, Apr 19 2019 3:06 AM

Many Suspicions About 1381 Kgs Gold Caught In Tamil Nadu - Sakshi

చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

సాక్షి, తిరుపతి: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. బంగారాన్ని ప్యాక్‌ చేసిన బాక్స్‌లపై బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ లేబుల్స్‌ ఉన్నా యి.  దీనిని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా తేలిందని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికా రులు వెల్లడించారు. పూందమల్లి రిటర్నింగ్‌ అధికారి రత్న సైతం దీనిని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు తేలిందని స్పష్టం చేశారు.

అయితే, చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసిన బంగారాన్ని శ్రీవారి క్షేత్రానికి తరలిస్తుండగా తమిళనాడులో పట్టుకు న్నారని చెబుతున్న టీటీడీ అధికారులు, ప్యాకెట్లపై బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ లేబుల్స్‌ ఎందుకు ఉన్నాయనే దానికి సమాధానం ఇవ్వటం లేదు. స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తమిళనాడు అధికారులు చెబుతుండగా.. దీనిపైనా టీటీడీ పెదవి విప్పటం లేదు. శ్రీవారి నగలను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే మింట్‌కు తరలించి కరిగిస్తారు. కడ్డీలుగా మార్చి ఆ తరువాత బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తారు. అయితే పట్టుబడ్డ బంగారంపై మింట్‌ ముద్రలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సీళ్లకు బదులు వేరే ముద్రలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
(చదవండి : 1,381 కేజీల బంగారం సీజ్‌)

శ్రీవారి నిధులు, బంగారాన్ని బ్యాంకు ల్లో డిపాజిట్‌ చేసే ముందు ధర్మకర్తల మండలి, స్పెసిఫైడ్‌ అథారిటీ, ఫైనాన్స్‌ కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారి బంగారాన్ని టీటీడీ అధికారులు ఎవరి అనుమతితో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారనే దానిపైనా ఎలాంటి సమాధానం లేదు. డిపాజిట్‌ గడువు తీరటంతో టీటీడీకి తీసుకు వస్తుండగా పట్టుకున్నారని చెబుతున్న అధికారులు.. కనీస భద్రత కూడా లేకుండా ఎలా తీసుకువస్తున్నా రనే దానిపైనా స్పష్టత ఇవ్వటం లేదు. ఇలాంటి ఎన్నో చిక్కుముడుల నడుమ స్వామివారి బంగారం విదేశాలకు వెళ్లిందా? అక్కడ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారా? అనే అనుమానాలూ ఉన్నాయి. 

అంత నిర్లక్ష్యమేంటి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం రూ.50 లక్షల నగదు, బంగారాన్ని ఒక బ్యాంక్‌ నుంచి మరో బ్యాంక్‌కు లేదా మరో చోటుకు తరలించాలంటే ఇద్దరు బ్యాంక్‌ సెక్యూరిటీ సిబ్బంది, మరో ఇద్దరితో పోలీస్‌ ఎస్కార్ట్‌ ఏర్పాటు చేస్తారు. అయితే, రూ.400 కోట్ల విలువ చేసే 1,381 కేజీల బంగారాన్ని తీసుకొచ్చే సమయంలో అటు బ్యాంకర్లు గానీ.. టీటీడీ అధికారులు గానీ ఈ నిబంధనలను పాటించి న దాఖలాలు కనిపించటం లేదు. ఒక మినీ లారీలో బంగారాన్ని ఉంచి డ్రైవర్, మరో ముగ్గురు సాధారణ వ్యక్తులు తీసుకొస్తున్నారు. ఆ వాహనం ముందు, వెనుక ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయలేదు. సాధారణంగా చిన్న ఆభరణాన్ని డిపాజిట్‌ చేస్తేనే తిరిగి తీసుకునే ప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. డిపాజిట్‌ చేసినట్టు ధ్రువీకరించే రసీదును విధిగా తీసుకుంటా రు. అటువంటిది రూ.400 కోట్ల విలువ చేసే బంగారాన్ని తీసుకునే సమయంలో ఇటువంటి జాగ్రత్తలేవీ పాటించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. అటు బ్యాంక్‌ అధికారులు సైతం బంగారా నికి ఎటువంటి పత్రాలు ఇవ్వకపోవడం వెనుక అంతర్యమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా..
ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రూ.50 వేలకు మించి నగదు, బంగారం ఉండకూడదని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ఇలాంటి సమయంలో రూ.400 కోట్ల విలువ చేసే శ్రీవారి బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందనే దానికి సమాధానం లేదు. పైగా ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానాలు చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్‌ చేసిన గడువు ముగిసి 20 రోజులు కావస్తోందని, ఈ దృష్ట్యా తిరిగి టీటీడీకి అప్పగించాలని బ్యాంక్‌ అధికారులకు లేఖ రాసినట్టు టీటీడీ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. పట్టుబడిన బంగారాన్ని బ్యాంక్‌ అధికారులే సంబంధిత పత్రాలతో వెళ్లి విడిపించుకు తెస్తారని టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవారి సొమ్ము రూ.వెయ్యి కోట్లు ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ బ్యాంక్‌లు ఉండగా.. ప్రైవేట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం ద్వారా టీటీడీ సంప్రదాయానికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రైవేట్‌ బ్యాంకులో ఎలా
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ఆనవాయితీ. టీటీడీలో కొందరు అధికా రులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బంగారాన్ని ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. పొరపా టున జరగరానిది జరిగి ప్రైవేట్‌ బ్యాంకులు జెండా ఎత్తేస్తే పరిస్థితి ఏమిటని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1,381 కేజీల బంగారాన్ని తిరుపతిలో ఉండే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే అవకాశం ఉన్నా.. కమీషన్లకు కక్కుర్తిపడి చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement