కోవైలో ఎన్‌ఐఏ సోదాలు | NIA Searches In Coimbatore Over Terror Alert | Sakshi
Sakshi News home page

కోవైలో ఎన్‌ఐఏ సోదాలు

Published Fri, Aug 30 2019 11:23 AM | Last Updated on Fri, Aug 30 2019 11:25 AM

NIA Searches In Coimbatore Over Terror Alert - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పేలుడు సంఘటనలతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్న కోయంబత్తూరుకు చెందిన ఐదుగురికి చెందిన ఇళ్లు, పుస్తకాల దుకాణంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం తనిఖీలు చేశారు. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్‌ పండుగ రోజున క్రైస్తవ ప్రార్థనామందిరాలు, స్టార్‌ హోటళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకోగా సుమారు 200 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐఎస్‌ఐ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జహరాన్‌ ఐఎస్‌ఐ తీవ్రవాది అనే ఇందుకు ప్రధాన సూత్రధారి అని కూడా అధికారులు గుర్తించారు. అతనితో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కోయంబత్తూరుకు చెందిన కొందరు సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలడంతో ఎన్‌ఐఏ అధికారులు వారిపై తీవ్రస్థాయిలో ఇటీవల నిఘా పెట్టారు.

జూన్‌లో కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి మహమ్మద్‌ అజారుద్దీన్, అక్రంజిందా, షేక్‌ ఇదయతుల్లా, అబూబకర్, సదాం హుస్సేన్, ఇబ్రహీం ఇళ్లు, అజారుద్దీన్‌కు చెందిన ట్రావెల్స్‌ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహమ్మద్‌ అజారుద్దీన్‌ కార్యాలయం నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు,  మెమొరీకార్డులు, సీడీ, డీవీడీలు, నిషేధిత పోస్టర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్‌ చేశారు. మిగతావారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో కోయంబత్తూరులో మరో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించారు. షాజహాన్, షబీబుల్లా, మహమ్మద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అరెస్టయిన అజారుద్దీన్‌ వద్ద జరిపిన విచారణలో కోయంబత్తూరు ఉక్కిడం జీఎంనగర్‌ మసీదు వీధికి చెందిన సదాం హుస్సేన్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో అతనికి కూడా సమన్లు పంపి విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం నాడు సద్దాం హుస్సేన్‌ ఇంటిలో తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన 25 మంది ఎన్‌ఐఏ అధికారుల బృందం కోయంబత్తూరు పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో సదాం హుస్సేన్‌తోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోకి అకస్మాత్తుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉదయం 10.30 గంటల వరకు సాగాయి. ఇదిలా ఉండగా, చెన్నైకల్‌పాక్కం సమీపం కూవత్తూరు గుండమనిచ్చేరి గ్రామానికి చెందిన సూర్య (22) ఈనెల 23వ తేదీన తిరుప్పోరూరులోని తన మేనమామ ఇంటికి వచ్చినపుడు తన స్నేహితులు దిలీప్‌రాఘవన్‌ (24), తిరుమాల్‌ (24), యువరాజ్‌ (27) జయరామన్‌ (26), విశ్వనాథన్‌ (24)లతో కలిసి 24వ తేదీన అక్కడి గంగై అమ్మన్‌ ఆలయ కొలను పూడిక తీశారు. అదేరోజున దిలీప్‌ జన్మదినం కావడంతో ఆలయ పరిసరాల్లో కేక్‌ కట్‌ చేసి సంబరం చేసుకున్నారు.

ఈ సమయంలో అక్కడ కనపడిన వస్తువులను చేతికి తీసుకుని తెరుస్తుండగా అది పేలడంతో సూర్య, దీలీప్‌ రాఘవన్‌ దారుణంగా మరణించారు. అలాగే చెంగల్పట్లు సమీపంలోని ఒక చెరువులో బాంబు బయటపడింది. సైనికులు, ఐపీఎస్‌ అధికారులకు అక్కడికి సమీపంలోని మైదానంలో తుపాకీపై శిక్షణ ఇస్తున్నందున వారిని లక్ష్యంగా చేసుకునే ఈ బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరుసలో గురువారం హనుమంతపురం చెరువులో ఒక ఆవు మేతమేస్తుండగా భారీఎత్తున పేలుడు పదార్థాలు బైటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కాగా, పుళల్‌ జైలు సూపరింటెడెంట్‌పై గురువారం దాడియత్నానికి దిగిన ఇద్దరు తీవ్రవాదులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement