
సాక్షి, చెన్నై: సింపుల్ గ్రే కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్న ఓ వ్యక్తి. స్కూల్ గేట్ దాటి ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన విద్యార్థులు.. అతన్ని చుట్టు ముట్టేసి ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. మిమల్ని వెళ్లనివ్వం సార్.. అంటూ ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. తిరువల్లూర్‌లోని వెలైగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
28 ఏళ్ల భగవాన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు. 2014లో వెలైగారం ప్రభుత్వ పాఠశాలకు జీటీగా అతన్ని ప్రభుత్వం నియమించింది. ఈ నాలుగేళ్లలో అతనికి విద్యార్థులకు మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే ఈ మధ్య ఉద్యోగ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. స్టాఫ్ తక్కువగా ఉన్న తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలకు అతన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భగవాన్‌ను వదలకుండా పట్టుకుని అడ్డగించి ఏడవటం ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు మద్ధతుగా భగవాన్‌ను స్కూల్ వదలి వెళ్లకండని ప్రాధేయపడ్డారు. వారి ఆప్యాయతకు కరిగిన భగవాన్ కూడా కన్నీళ్లు కార్చాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది.
అయితే ఏడుస్తున్న చిన్నారులను పక్కకు తీసుకెళ్లిన భగవాన్.. వారిని సముదాయించే యత్నం చేశాడు. తిరిగి కొన్నిరోజులకు మళ్లీ వస్తానని చెప్పటంతో వారు శాంతించారు. ‘పాఠశాలను సినిమా కథల్లాగా అతను బోధించేవాడు. పైగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భగవాన్ మెదిలేవాడు. అందుకే అతనితో వారికి అంత బంధం ఏర్పడింది. ఆయన బదిలీ వార్త తెలియగానే కొందరు విద్యార్థులు.. ఆ కోపాన్ని మాపై ప్రదర్శించారు. కానీ, మేమేం చేయలేమన్న విషయం వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆ టైంలో మాకు తోచలేదు’ అని హెడ్ మాస్టర్ అరవింద్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment