నాలుగు కాళ్ల రోబో వచ్చేసింది!
టోక్యో: కొత్త కొత్త రోబోల తయారీకి పెట్టింది పేరైన జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ నాలుగు కాళ్ల రోబోను తయారుచేశారు. వేగాన్నిబట్టి దానంతట అదే నడిచే పద్ధతిని మార్చుకోడం... అంటే అవసరమైతే రెండు కాళ్ల మీద కూడా నడవడం ఈ రోబో ప్రత్యేకతగా చెబుతున్నారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం ఈ రోబోను ఉపయోగించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఇది కేవలం నడవడం, పరిగెత్తడమే కాకుండా కొండలు, గుట్టలు, గోడలు, కంచెల వంటివాటిని సులభంగా ఎక్కేస్తుందని వీటి తయారీదారులైన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఇది కొంత ఇబ్బంది పడుతోందని, పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారా నడిచే ఈ రోబోకు తుది మెరుగులు దిద్దాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతానికి వేగాన్ని అంచనా వేసుకుంటూ నడక స్టయిల్‌ను మార్చుకునే వరకు విజయవంతంగా ప్రయోగించారు. అయితే మిగతా పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకోవడం, అవసరమైన సహాయాన్ని చేసేలా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.