జియో ఫోన్‌ కోసం వేచిచూస్తున్నారా? | JioPhone delivery may be delayed | Sakshi
Sakshi News home page

జియో ఫోన్‌ కోసం వేచిచూస్తున్నారా?

Published Thu, Sep 21 2017 10:43 AM | Last Updated on Fri, Sep 22 2017 11:05 AM

JioPhone delivery may be delayed

నవరాత్రికి జియో ఫోన్‌ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో షాకింగ్‌ న్యూస్‌. నేటి నుంచి డెలివరీ కావాల్సిన జియో ఫోన్‌ తేదీలను మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 1కి ఈ ఫోన్‌ డెలివరీ డేట్‌ను వాయిదా వేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ ఫోన్‌ ప్రీ-ఆర్డర్‌ సమయంలో అనూహ్య స్పందన రావడంతో, డెలివరీ తేదీని కంపెనీ వాయిదా వేస్తూ వెళ్తున్నట్టు తెలిపాయి. ఆగస్టు 24న ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ భారీ ఎత్తున్న డిమాండ్‌ రావడంతో ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రీ-బుకింగ్స్‌ నిలిపివేసింది. జులై 21న రిలయన్స్‌ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్‌ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరించిన రోజే, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ ఫోన్ల డెలవరీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 
కానీ డిమాండ్‌ అధికంగా రావడంతో, వీటి డెలివరీ మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్‌ 21 నుంచి ఈ ఫోన్‌ వినియోగదారుల చేతుల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ ఈ నవరాత్రికి కాకుండా... అక్టోబర్‌ మొదటి నుంచి దీన్ని అందించాలని కంపెనీ చూస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. తమకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని, ఫోన్ల డెలివరీ అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు చెప్పారని ఓ రిటైలర్‌ వెల్లడించారు. ఇప్పటికే లక్షల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకొని ఈ ఫోన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఫోన్ల డెలివరీ వాయిదా పడటం కస్టమర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే నిలిపివేసిన ప్రీ-బుకింగ్స్‌ను కంపెనీ త్వరలోనే మళ్లీ ప్రారంభించనుందట. ఈ ఫోన్‌ ఫ్రీ-అయినప్పటికీ, బుకింగ్‌ సమయంలో రూ.500, డెలివరీ సమయంలో రూ.1000 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ వినియోగదారులకు రీఫండ్‌ చేయనుంది. వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 2.4 అంగుళాల డిస్‌ప్లే, 512ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128జీబీ ఎక్స్‌పాండబుల్‌ జీబీ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ఫీచర్లు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement