ఎల్జీ జీ6పై మరోసారి భారీ డిస్కౌంట్
ఎల్జీ జీ6పై మరోసారి భారీ డిస్కౌంట్
Published Wed, Jun 14 2017 11:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై మరోసారి భారీ తగ్గింపును ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్ కింద కొనుగోలుదారులకు రూ.13వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కలిగి ఉన్నవారికేనని కంపెనీ తెలిపింది. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పై కంపెనీ అదనపు డిస్కౌంట్లను, ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐస్ ప్లాటినం, ఆస్ట్రో బ్లాక్ రంగుల ఆప్షన్లపై ఈ డిస్కౌంట్ వర్తించనుంది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.51,990గా ఈ ఫోన్, ప్రైమ్ మెంబర్లకు రూ.38,990కే లభ్యమవుతోంది.
ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్ పై ఇదే అత్యంత తక్కువ ధర. అంతకముందు మే నెలలో కూడా ఈ ఫోన్ పై 10వేల రూపాయల తగ్గింపును కంపెనీ పరిమిత కాల వ్యవధిలో అందించింది. లాంచ్ అయిన రెండు నెలలోనే రెండు సార్లు భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించడం విశేషం. భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పాటు బజాజ్ ఫైనాన్స్ కార్డులపై ఎలాంటి ధరలు లేని ఈఎంఐ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 100జీబీ వరకు అదనపు 4జీ రిలయన్స్ జియో డేటా కూడా వస్తోంది. ఈ ఫోన్ భారత్ లో లాంచైనప్పటి నుంచి రిలయన్స్ జియో డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరిలో మొదటిసారి ఎండబ్ల్యూసీ 2017లో ఎల్జీ జీ6 ను లాంచ్ చేశారు. ఏప్రిల్ లో భారత్ లో రూ.51,990కు దీన్ని ప్రవేశపెట్టారు.
Advertisement
Advertisement