డోంట్ వర్రీ: ఆ స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరగవు!
డోంట్ వర్రీ: ఆ స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరగవు!
Published Sat, Jul 1 2017 10:28 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
న్యూఢిల్లీ : వామ్మో నేటి నుంచి జీఎస్టీ వచ్చేసింది.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సిందేనని భయపడుతున్నారా? అయితే ఇలాంటి భయాలేమీ అక్కర్లేదట. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండు తయారీదారులు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు చెప్పాయి. కొత్త పన్ను విధానంతో పడబోయే వ్యయాన్ని తామే భరించాలని కూడా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఈ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టనేని తెలుస్తోంది.
జీఎస్టీ ప్రభావం తమ ధరలపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా చెప్పారు. ''ప్రస్తుతం మార్కెట్లో భిన్నమైన పన్ను విధానం ఉంది. కొన్ని మార్కెట్లో నీవే పన్ను కడితే, కొన్ని మార్కెట్లో పన్నులను నీవే పొందుతావు'' అని చెప్పారు. జీఎస్టీ వల్ల పన్నుభారం పెరుగుతుందని, కానీ వాటిని కంపెనీలే భరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చైనీస్ కంపెనీలు షియోమి, ఒప్పోలతో పాటు దేశీయ హ్యాండ్‌సెట్ తయారీదారి లావా కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావంతో రేట్లను పెంచమని చెప్పాయి.
సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కూడా ప్రస్తుత మోడల్స్ రేట్లను పెంచకూడదని నిర్ణయించిందని తెలిసింది. అయితే కొత్త మోడల్స్‌పై జీఎస్టీ రేటు 12 శాతాన్ని విధించాలని చూస్తున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. మైక్రోమ్యాక్స్ మాత్రం దీనిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది.
ఇండస్ట్రీ డేటా ప్రకారం మొత్తం 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లపై 5 శాతం వ్యాట్ రేటు, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి. అంటే మొత్తంగా మొబైల్ ఫోన్లపై 6 శాతం పన్ను ఉంది. జీఎస్టీ కింద వీటికి 12 శాతం పన్ను రేటు విధించారు. అంటే ప్రస్తుతమున్న దానికంటే 4-5 శాతం ఎక్కువ. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ రేట్లు ఎక్కువగా ఉన్నందున వారికి జీఎస్టీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. వ్యాట్ రేటు తక్కువగా ఉన్న పంజాబ్, రాజస్తాన్, చండీఘర్ లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతుండగా.. వ్యాట్ ఎక్కువగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో ధరలు తగ్గనున్నాయి.
Advertisement