జియోకు కౌంటర్: ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్
జియోకు కౌంటర్: ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్
Published Tue, Aug 22 2017 8:37 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు కౌంటర్ ఇవ్వబోతుంది. దీపావళి కానుకగా ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడం కోసం హ్యాండ్‌సెట్ తయారీదారులతో ఎయిర్‌టెల్ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్టు కూడా తెలిసింది. 2,500 రూపాయలతో ఈ డివైజ్ మార్కెట్‌లోకి రాబోతుందని, ఎక్కువమొత్తంలో డేటా, వాయిస్ మినిట్స్‌తో ఎయిర్‌టెల్ దీన్ని తీసుకొస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ ఈ మేరకు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. పాపులర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆధారితంగా ఇది రూపొందుతుంది. ఈ 4జీ డివైజ్‌ను టాప్ దేశీయ టెల్కో, హ్యాండ్‌సెట్ తయారీదారి కో-ప్రమోట్ చేయనుంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో లభించే అన్ని రకాల యాప్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఈ టెల్కో అనుమతి కల్పించనుంది. ఈ ఫోన్ లాంచింగ్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదట్లో ఉండొచ్చు.
''రూ.2,500 ధర మధ్యలో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఎయిర్‌టెల్ కొన్ని హ్యాండ్‌సెట్ తయారీదారులతో చర్చలు జరుపుతోంది. ఆ స్మార్ట్‌ఫోన్, రిలయన్స్‌జియో ఆఫర్ చేసిన ఫీచర్ ఫోన్ కంటే మెరుగ్గా, పెద్ద స్క్రీన్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండేలా రూపొందించాలని ప్లాన్ చేస్తుంది'' అని ఎయిర్‌టెల్ ప్లాన్స్‌కు సంబంధించిన సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఈ చర్చలు చాలా అడ్వాన్స్ దశలో కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
4జీ స్మార్టఫోన్ మార్కెట్ కోసం టెలికాం మార్కెట్ లీడర్‌తో లావా, కార్బన్ కంపెనీలు వేరువేరుగా చర్చలు జరిపినట్టు ఆ కంపెనీలు ధృవీకరించాయి. అయితే మార్కెట్‌లో వచ్చే ఊహాగానాలపై స్పందించేది లేదని భారతీ ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. ఒకవేళ ఎయిర్‌టెల్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైతే, జియోకు ఇది గట్టిపోటీగా నిలువనుంది. మరోవైపు జియో ఫోన్ కూడా సెప్టెంబర్‌లోనే మార్కెట్‌లోకి వస్తుంది. రెండు డివైజ్‌లు ఒకేసారి పోటాపోటీగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Advertisement