పాత గోడ కూలి పక్కనే ఉన్న 10 వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ముషీరాబాద్ (హైదరాబాద్) : పాత గోడ కూలి పక్కనే ఉన్న 10 వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన గురువారం నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్‌మెట్‌లో ఉన్న మేడిబావి బస్తీలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న జైరాం స్టీల్స్‌కు చెందిన 9 వేల గజాల స్థలాన్ని కిషన్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవలే కొనుగోలు చేశాడు. అయితే ఈ స్థలంలో వాస్తు కోసం 110 గజాల విస్తీర్ణంలో బావిని తవ్వి ఆ మట్టిని గోడ పక్కనే పోయించారు.
కాగా గురువారం కురిసిన వర్షం కారణంగా మట్టి కుంగిపోయి, గోడపై ఒత్తిడి పెరగడంతో అది కుప్పకూలింది. ఇదే సమయంలో గోడపక్కనే ఉన్న దాదాపు 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. వీటిలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలున్నాయి. ఈ ఘటనతో నష్టపరిహారం చెల్లించాల్సిందేనని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.