హన్మకొండ అర్బన్ : పల్లెల్లో పేదలకు కల్పతరువుగా ఉన్న ఉపాధి హామీ పథకం అమలులో రూపురేఖలు మారనున్నాయి. కూలీలు ఉన్నా... లేకున్నా పనులు సిద్ధం చేయడం, పనులు ఉన్నా.. లేకున్నా... కూలీలకు ఉపాధి కల్పించాల్సి రావడం వంటి వాటికి చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపాధి పథకం అమలులో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ఇంతకాలం గ్రామస్థాయిలో పనులు గుర్తించి గ్రామ సభల్లో ఆమోదింపజేసి... వాటిని ప్రభుత్వానికి పంపేవారు. ఈ క్రమంలో కొంతవరకు రాజకీయ జోక్యం ఉండేది. అవసరం లేని చోట్ల కూడా అడ్డగోలుగా పనులు చేసినట్లు చూపి రూ.కోట్లలో నిధులు వృథా అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ‘పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ’ పేరుతో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామాల్లో పనులు సిద్ధం చేస్తున్నారు.
పనుల కోసం ఇంటింటి సర్వే...
కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉన్న ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం కూలీలు ఏ పని కావాలంటే ఆ పనే చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నారు... వారు ఏ విధమైన పనులు కావాలని కోరుకుంటున్నారు... అన్న వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వారు చేస్తామన్న పనులను సిద్ధం చేసి... వాటిని గ్రామ సభల్లో ఆమోదం పొందేలా చేస్తున్నారు.
ఈవిషయంలో కూలీలు, కూలీల కుటుంబాలు ఇచ్చే వ్యక్తిగత అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అడిగిన పని కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్‌లో వ్యక్తుల వారీగా పూర్తి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి, రక్షణ, ప్లాంటేషన్, భూమి అభివృద్ధి వంటి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజాప్రతినిధులకు అవగాహన
క్షేత్రస్థాయిలో అధికారులు చేపడుతున్న సర్వే పనులపై ముందుగా గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం ఒక్కో గ్రామం నుంచి ఇద్దరి తటస్తుల (ఈజీఎస్ ఉద్యోగులు కానివారు)ను ఎంపిక చేసి వారికి సర్వే వివరాల సేకరణపై శిక్షణ ఇస్తున్నారు. మొత్తం శిక్షణ పూర్తయిన తర్వాత పది మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పాటు చేసి గ్రామాల్లో సర్వే చేస్తున్నారు.
ప్రతి బృందానికి ఒక టీఏ ప్రతినిధిగా ఉంటారు. సర్వే పూర్తి కాగానే వివరాలు కంప్యూటరీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. డిసెంబర్ ఆఖరులోగా ఈ పనులన్నీ పూర్తి చేసి లేబర్ బడ్జెట్ రూపొందించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం నిధులు మంజూరవుతాయి. దీనివల్ల కూలీలు కోరుకున్న పనులు చేసే అవకాశం ఉంటుంది.
జిల్లాలో 10 మండలాల ఎంపిక
పటిష్ట భాగస్వామ్య ప్రక్రియకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 78 మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 10 మండలాలను ఎంపిక చేశారు. చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపూర్, కొడకండ్ల, కొత్తగూడ, మరిపెడ, నర్మెట, రేగొండ, వెంకటాపూర్ మండలాలు ఎంపికయ్యూరుు. ఈ మండలాల్లో ప్రస్తుతం జాబ్‌కార్డు ఉన్న కూలీలు 3,77,802 మంది ఉన్నారు. 63,573 కుటుంబాల్లోని 1,26,474 మంది ఉపాధి పొందుతున్నారు.
మిగతా మండాలాల్లో పాత పనులే..
ప్రస్తుతం పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక కింద ఎంపికైన 10 మండలాలు మినహా... మిగతా మండలకు కొత్తగా పనుల మంజూరు ఉండదు. ఇంత కాలం చేసిన పనులు పెండింగ్‌లో ఉన్నట్లయితే.. వాటిని మాత్రమే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం మాత్రమేనని, తదుపరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇక.. 10 మండలాలకే ‘ఉపాధి’
Published Wed, Nov 19 2014 2:45 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement