సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ 10,446 కొలువులను భర్తీ చేసింది. 2014 నుంచి 2019 మే వరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో 3,025 మంది, డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పథకం కింద మరో 7,421 మందిని నియమించింది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, పర్సనల్, అకౌంట్స్, తదితర విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇంత పెద్ద మొత్తంలో నియామకాలు జరపడం ఇదే తొలిసారని సంస్థ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఖాళీల భర్తీలో ప్రత్యేక చొరవ చూపారని తెలిపింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రాత పరీక్ష ద్వారానే నియామక ప్రక్రియ జరిపామని పేర్కొంది.
కొత్తగా ఉద్యోగాలు పొందిన నాన్ కేడర్ వర్కర్ కేటగిరీలో క్లర్కులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, సర్వేయర్లు తదితర టెక్నీషియన్ల నియామకం జరపగా, అధికారుల విభాగంలో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీర్లు, సివిల్, ఫైనాన్స్, అకౌంట్స్, పర్సనల్, ఫారెస్ట్, సెక్యూరిటీ అధికారులు, స్పెషలిస్టు డాక్టర్లు తదితరులను నియమించినట్లు వెల్లడించింది. చనిపోయిన, అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలిచ్చే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపింది. గతంలో నెలకు 20 లేదా 30 మందికి మాత్రమే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తుండేవారని, ప్రస్తుతం నెల కు 150 నుంచి 200 మందికి ఉద్యోగాలిస్తున్నామని పేర్కొంది. 2014లో 674 మందికి ఉద్యోగాలివ్వగా 2015లో 1,989 మందికి, 2018లో 1,663 మందికి, 2019లో మే వరకు 1,378 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
4,728 మందికి కారుణ్య నియామకాలు
కారుణ్య నియామక ప్రక్రియ 2018 ఏప్రిల్ నుంచి ముమ్మరంగా సాగుతోందని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు నిమ్స్, గాంధీ ఆసుపత్రి తదితర ప్రభుత్వ వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరీక్షించి అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారు సూచించిన వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 38 మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించగా 4,728 మంది కార్మికులు కారుణ్య నియామక ప్రక్రియలో తమ వారసులకు ఉద్యోగం లభించే అవకాశం పొందారని వెల్లడించింది. ఇంతమంది సింగరేణిలో ఉద్యోగాలు పొందడంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు.
సింగరేణిలో 10,446 కొలువుల భర్తీ!
Published Fri, Jun 14 2019 3:35 AM | Last Updated on Fri, Jun 14 2019 3:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment