ఇదో రకమైన ‘పరీక్ష’! | 18 students injured in road accident | Sakshi
Sakshi News home page

ఇదో రకమైన ‘పరీక్ష’!

Published Tue, Mar 15 2016 1:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ఇదో రకమైన ‘పరీక్ష’! - Sakshi

ఇదో రకమైన ‘పరీక్ష’!

♦ ఆటో బోల్తా, 19 మంది ఇంటర్ విద్యార్థులకు గాయాలు
♦ ఒకరి పరిస్థితి విషమం
♦ గాయాలతోనే పరీక్షలు రాసిన 18 మంది
 
 మిరుదొడ్డి: ఆటో బోల్తా పడగా 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 18 మంది విద్యార్థులు గాయాలతోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలలో సోమవారం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం దౌల్తాబాద్ నుంచి పరీక్షలు రాయడానికి 19 మంది విద్యార్థులు ఆటోలో మిరుదొడ్డికి బయలుదేరారు. పెద్ద చెప్యాల రాజీవ్ గాంధీ చౌరస్తా మూల మలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చేగుంట మండలం గోవిందాపూర్‌కు చెందిన సతీశ్‌కుమార్‌కు నడుము భాగంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి.  

 గాయాలతోనే పరీక్షలు
 18 మంది విద్యార్థులు గాయాలను భరిస్తూనే ఇంటర్ సెకండియర్ పరీక్షను రాశారు. పరీక్షలు రాసిన అనంతరం స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయాలతోనే పరీక్షలు రాసిన విద్యార్థుల పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

 తరలి వచ్చిన ఇంటర్ బోర్డు అధికారులు
 ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు డా. నాగమణి రత్నం, డా. నర్సింహులు హైదరాబాద్ నుంచి మిరుదొడ్డిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జరిగిన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేదని విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. వచ్చే ఏడాదికి దౌల్తాబాద్‌లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా నివేదికలు అందిస్తామని బోర్డు సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement