దీర్ఘకాలిక బిడ్డింగ్ పిలవాలని నిర్ణయించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఏడేళ్ల పాటు రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని టీ సర్కార్ నిర్ణయించింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఏడేళ్ల పాటు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఇంధన శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే మధ్యకాలికంగా ఐదేళ్ల పాటు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు అనుగుణంగా ఆగస్టు 6న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరహా మధ్యకాలిక బిడ్డింగ్‌లో కేవలం విదేశీ బొగ్గుపై ఆధారపడిన ప్లాంట్లు మాత్రమే పాల్గొనాలని కేంద్ర నిబంధనలు ఉన్నాయి. తద్వారా కంపెనీలు కోట్ చేసే యూనిట్ ధర అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో... మధ్యకాలిక బిడ్డింగ్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఏడేళ్ల కాలానికి అంటే దీర్ఘకాలిక బిడ్డింగ్‌ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.