
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు అప్పుడే ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకుగాను గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. కానీ, గత నెలలోనే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలవడం వంటి కారణాలతో లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఈ సారి జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం తమదే అన్న ధీమా అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యక్తం చేస్తుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుందని, తమకు అనుకూల పవనాలు వీస్తాయన్న ఆశాభావం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కొందరు సీనియర్లు విముఖంగా ఉన్నారని అంటున్నారు. దీంతో తమకు లోక్‌సభ టికెట్ ఇవ్వాలని కోరుతున్న యువ నాయకుల సంఖ్య పెరుగుతోంది. నల్లగొండ స్థానంనుంచి తాను పోటీకి దిగుతానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి పేరు మినహా రెండో పేరు బయటకు రాలేదు.
భువనగిరి టికెట్‌కోసం పోటాపోటీ!
భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. భువనగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి సుముఖంగా ఉన్నానని, తనకు టికెట్ కేటాయించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్ రెడ్డి కోరుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియాను కలిసి తనకు టికెట్ కేటాయించి పోటీ చేసే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.
అదే మాదిరిగా.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. అయితే.. చామల కిరణ్‌కుమార్ రెడ్డి కుంతియాను కలిసినప్పుడు ఆయన వెంట అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రణాళికల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ స్థానాన్ని ఓసీలకు కేటాయించే పక్షంలో భువనగిరి టికెట్‌ను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ కూడా పార్టీలో ఉంది.
మద్దతు కూడగడుతున్న ఆశావహులు
నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా ఏ సీనియర్ నేతా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించలేదు. ఆ పార్టీ సీనియర్లు దాదాపు పోటీకి విముఖంగానే ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక.. టికెట్ ఆశిస్తున్న వారు రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతల మద్దతు కూడగడుతున్నారు. టీ.పీసీసీ రాష్ట్రం నుంచి ఏఐసీసీ నాయకత్వానికి పంపించే ‘ప్రాబబుల్స్’జాబితాలో తమ పేరు ఉండేలా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఏఐసీసీ నాయకత్వంతో తమకు ఉన్న పరిచయాలు, సంబంధాల నేపథ్యంలో రాష్ట్రంనుంచి పంపించే జాబితాలో పేరు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. రానున్న రెండు వారాల్లో ఈ పేర్ల విషయలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.