
పోటెత్తిన భక్తజనం
తొమ్మిదో రోజు.. 34 లక్షలు
- ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 28 లక్షల మంది పుణ్యస్నానాలు
- నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది..
- గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ స్నానాలు
- మరో మూడ్రోజులే ఉండటంతో పెద్ద ఎత్తున వస్తున్న జనం
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్ /నల్లగొండ: వరుసగా తొమ్మిదో రోజూ పుష్కర ఘాట్లు భక్తజనంతో నిండిపోయాయి. పుష్కరాల ముగింపునకు మరో మూడ్రోజులే ఉండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 34 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 28 లక్షలకుపైగా, నల్లగొండ జిల్లాలో సుమారు 6 లక్షల మంది స్నానాలు చేశారు. వీఐపీలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు.
పాలమూరు ఘాట్లు కిటకిట..
మహబూబ్‌నగర్ జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, అలంపూర్, నంది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్‌పాడు, పాతాళగంగ ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. సోమశిలలో 7.3 లక్షలు, రంగాపూర్‌లో 6.4 లక్షలు, బీచుపల్లిలో రూ.4.4 లక్షలు, గొందిమళ్లలో 1.58 లక్షలు, నంది అగ్రహారంలో 1.44 లక్షలు, కృష్ణ పుష్కరఘాట్‌లో లక్షకుపైగా పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ఘాట్లలో శనివారం నీటిమట్టం తగ్గినా భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్-కర్నూలు ప్రధాన రహదారిపై భూత్పూర్ వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొల్లాపూర్, సోమశిల మధ్యలో సైతం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో కర్నూలు, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. మొత్తంగా జిల్లాలో 28 లక్షల మందికి పైగా స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
సాగునీటి వనరుల పెంపు అభినందనీయం
సాగునీటి వనరులను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని, అందరికీ ఆహార భద్రత కల్పించాలన్న మౌలిక లక్ష్యం ఇందులో దాగి ఉందని గవర్నర్ ఈఎల్ నరసింహన్ అన్నారు. గొందిమళ్లలో పుష్కరస్నానం అనంతరం ఆయన టూరిజం అతిథి గృహం లో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వాలైనా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తాయని, వారు చేసే సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల చేయూత అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. బాలికా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రేపటి భవిష్యత్తంతా బాలబాలికలదేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల ప్రయోజనానికే అన్న అంశాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత మీడియాపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాల్లో జరిగే లోపాలను ఎత్తిచూపడం సమంజసమే అయినా అవి సహేతుకంగా, సలహాపూరితంగా ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలను రెండు తెలుగు రాష్ట్రాలు సమర్థంగా నిర్వహించాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అత్యద్భుత దేవాలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాను సీఎంకు జోగుళాంబ టెంపుల్ టూరిజం ఆవశ్యకతను వివరిస్తానన్నారు.
నల్లగొండలో జనజాతర
నల్లగొండ జిల్లాలో వరుసగా రెండోరోజు పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం పర్వదినం రోజున జిల్లాలో ఆరు లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా.. శనివారం కూడా అదే సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. జిల్లాలోని మట్టపల్లి క్షేత్రం భక్తులతో కళకళలాడింది. శనివారం ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. నాగార్జునసాగర్ అయితే భక్తులతో పోటెత్తింది. సాగర్‌తో పాటు పక్కనే ఉన్న ఊట్లపల్లి ఘాట్‌లో కలిపి మొత్తం 2 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు. వాడపల్లిలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. జిల్లాలోని ఇతర ఘాట్లలో కనగల్ మండలం దర్వేశిపురానికి 60 వేల మంది భక్తులు రాగా.. పానగల్, కాచరాజుపల్లి, మహంకాళిగూడెం, అడవిదేవులపల్లి ఘాట్లలో పదివేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తంమీద జిల్లాలోని 28 ఘాట్లు కలిపి ఆరు లక్షల మంది దాటి ఉంటారని అంచనా.
గవర్నర్ స్వీయ సంకల్పం
గవర్నర్ నరసింహన్ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్‌లో సతీసమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ ఉదయం 10 గంటలకు గొందిమళ్లకు చేరుకున్నారు. అనంతరం అక్కడి వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించి, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర పెట్టారు. స్నాన సంకల్పంలో భాగంగా అర్చక స్వామి సంకల్పం చెబుతుండగా ‘కృష్ణా నదీ ఉత్తరాయనే..’ అని పఠించారు. వెంటనే గవర్నర్ కలుగజేసుకొని ‘కాదు..’ అంటూ ‘దక్షిణాయనే వర్షరుతౌ.. శ్రావణ మాసే..’ అంటూ తమ గోత్రనామాలు చెబుతూ సంకల్పాన్ని పూర్తి చేశారు. స్నానానంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వరుడి ఆలయంలో సైతం తానే స్వయంగా పురుష సూక్తం చెబుతూ అభిషేకం చేశారు.
ఒకవైపు సమయం పడుతుండటంతో భద్రతాధికారులు త్వరగా ముగించమంటూ అర్చక స్వాములకు సంకేతం ఇచ్చారు. దీంతో అర్చక స్వాములు పురుష సూక్తాన్ని సూక్ష్మంగా ముగించే ప్రయత్నం చేయగా.. గవర్నర్ పురుష సూక్తాన్ని గడగడా పఠిస్తుండటంతో చేసేది లేక అర్చకులు మంత్రాలు పూర్తిగా పఠించాల్సి వచ్చింది. అత్యంత నిష్ఠగా పూజలో ఎక్కడా లోపం లేకుండా గవర్నర్ మంత్రాలు చెప్పడంతో అక్కడున్న అర్చక స్వాములు ఆశ్చర్యపోయారు. అనంతరం గవర్నర్ హెలికాప్టర్ ద్వారా అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాల హెలిపాడ్‌కు చేరుకున్నారు. హరిత విశ్రాంతి భవనంలో కొద్దిసేపు ఆగి తర్వాత అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లారు.
పెరిగిన వీఐపీల తాకిడి
కేంద్రమంత్రి దత్తాత్రేయ గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించి, అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించి ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం రంగాపూర్ పుష్కరఘాట్‌ను సందర్శించారు. క్యాతూర్‌లోని పుష్కరఘాట్‌లో సినీ నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్ పుణ్యస్నానం చేశారు. మాజీ మంత్రి మా దాల జానకిరాం ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ గొందిమళ్లలో స్నానాలు చేశారు. సినీ నటుడు చం ద్రమోహన్ సోమశిల పుష్కరఘాట్‌ను దర్శించారు. అయితే అక్కడ నీటిమట్టం తక్కువగా ఉండడంతో సమీపంలోని మంచాలకట్ట ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మంచాలకట్టలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల ఘాట్‌ను సందర్శించి పుణ్యస్నానం ఆచరించారు. రంగాపూర్ ఘాట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించారు. నల్లగొండ జిల్లా వాడపల్లిలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే బాపూరావ్ రాథోడ్, గుంటూరు రైల్వే రీజినల్ మేనేజర్ విజయవర్మ, ఇర్కిగూడెంలో రిటైర్డ్ ఎస్పీ వెంకట్‌రెడి, మట్టపల్లి ప్రహ్లాద ఘాట్‌లో తమిళనాడులోని మదురై కోర్టు జడ్జి రామ్మోహన్‌రావు పుష్కర స్నానాలు ఆచరించారు. కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ వాడపల్లి శివాలయంలో పూజలు నిర్వహించారు. అడవిదేవులపల్లి ఘాట్‌లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు కుటుంబ సభ్యులతో స్నానాలు చేశారు.