ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ శాఖలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఒక్క పదోన్నతి కూడా లభించక తీవ్ర నిరాశలో ఉన్న కానిస్టేబుళ్ల ఆవేదనకు అక్షర రూపమిస్తూ ‘సాక్షి’ ప్రధాన సంచికలో ఇటీవల ప్రచురించిన ‘పాతికేళ్లుగా పనిచేస్తున్నా పదోన్నతి లేకపాయె!’కథనం పోలీస్ శాఖను కుదిపేసింది. ఈ కథనం ఆధారంగా ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో విచారణ జరిపించారు. పదోన్నతులు రాకపోవడంపై కానిస్టేబుళ్లలో ఆందోళన నెలకొందని, ఖాళీగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తే వారు సంతోషించడంతోపాటు గౌరవంగా భావిస్తారని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల కోసం వేచిచూస్తున్న వేలాది మంది కానిస్టేబుళ్లకు తీపికబురు అందిస్తూ పదోన్నతుల ప్రతిపాదన ఫైలుకు ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
4 వేల మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా...
రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్లు, జిల్లాల్లో పనిచేస్తున్న 4 వేల మంది సివిల్ కానిసేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందే వారి జాబితాను వెంటనే సిద్ధం చేసి ఈ నెల 25లోగా పదోన్నతుల ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా జనవరి మొదటి వారానికల్లా పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇప్పటికే కొత్త జిల్లాల్లో జీవో నంబర్లు 124, 148 కింద నూతనంగా ఏర్పాటు చేసిన 1,500 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) పోస్టులను పదోన్నతుల రూపంలో భర్తీ చేస్తూ గత నెలలో రిటైర్మెంట్‌కు ముందు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలిచ్చారు. దీంతో స్వల్ప వ్యవధిలో మొత్తంగా 5,500 మంది పోలీస్ సిబ్బంది పదోన్నతులు పొందినట్లు కానుంది. నిబంధనల ప్రకారం సమయానికల్లా పదోన్నతి పొందే అధికారులు... తమకు రావాల్సిన పదోన్నతులపై మాత్రం నోరుమెదపకపోవడంపై ఇంతకాలం తీవ్ర అసహనంతో ఉన్న కానిస్టేబుళ్ల మనసుల్లో డీజీపీ నిర్ణయం ఆనందం నింపింది.
ప్రమోషన్ల తర్వాతే శిక్షణ...
గతంలో ఉన్నట్లుగా శిక్షణ అనంతరం పదోన్నతి కాకుండా, పదోన్నతి ఆదేశాలు పొందిన తర్వాతే శిక్షణకు పంపించాలని అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందే సిబ్బంది ఇప్పటివరకు 90 రోజులపాటు శిక్షణ పొందే నిబంధన ఉండేది. అయితే వయసు పైబడిన కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ కష్టమవుతుందన్న ఉద్దేశంతో దీన్ని గత డీజీపీ అనురాగ్‌శర్మ 42 రోజులకు తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment