సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు 4,066 మంది ఎంపికయ్యారని ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 2017 లో ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ హజ్ కమిటీని దేశంలోనే నంబర్ వన్ కమిటీ అని కేంద్ర హజ్ కమిటీ ప్రశంసించిందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్‌లో 2018 సంవత్సరానికి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న యాత్రికుల ఎంపిక డ్రా పద్ధతిలో జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు ఐదారువేల మంది వెళ్లేవారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేవలం రాష్ట్రం నుంచే 4,500 మంది యాత్రకు వెళుతున్నారని వివరించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగి ఐదువేల వరకు చేరుతుందన్నారు. కోటా పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారని తెలిపారు. యాత్రికు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌదీ అరేబియా ప్రభుత్వంతో కూడా మాట్లాడతామ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్ కమిటీ వార్షిక బడ్జెట్ కేవలం రూ. 1.50 కోట్లుండేదని, వచ్చే ఏడాది నుంచి దాన్ని రూ. 5 కోట్లకు పెంచుతామన్నారు.
31 లోపు సర్టిఫికెట్లు సమర్పించాలి
2018 హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 17,130 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో 70 ఏళ్లకు పైబడినవారు ప్రత్యేక కేటగిరీలో నేరుగా 508 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్ చెప్పారు. మిగతా 16,622 మంది యాత్రికులలో డ్రా పద్ధతిలో 3,558 మంది ఎంపికయ్యారన్నారు. డ్రాలో ఎంపికైన యాత్రికులు ఈ నెల 31 లోపు పాస్‌పోర్టు, మెడికల్ సర్టిఫికెట్లతో పాటు హజ్ యాత్ర తొలి కిస్తు రూ. 81 వేల డీడీని కూడా హజ్ కమిటీకి జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రకు 4,066 మంది ఎంపిక
Published Fri, Jan 12 2018 1:07 AM | Last Updated on Fri, Jan 12 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment