ఒక్కో మృతదేహం శరీరంలో 5 నుంచి 8 బుల్లెట్లు!
వరంగల్: వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదుల శరీరాల్లో సగటున ఐదు నుంచి ఎనిమిది బుల్లెట్లు దిగాయి. పోలీసులకు మొదటి నుంచి కొరకరాని కొయ్యగా ఉన్న వికార్ అహ్మద్ దేహంలో ఎనిమిది బుల్లెట్లు ఉన్నాయి. వికారుద్దీన్ తలలో, ఛాతీలో బుల్లెట్లు దిగాయి. మిగిలిన నలుగురి దేహాల్లోనూ ఐదు చొప్పున బుల్లెట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వికార్ అహ్మద్, సయద్ అమ్జద్, ఇజార్ ఖాన్, మహ్మద్ జకీర్, మహ్మద్ హనీఫ్ మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇజార్‌ఖాన్ మృతదేహం ఎంజీఎంలోనే ఉంది. మిగిలిన నలుగురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పకడ్బందీగా పోస్టుమార్టం
బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అధిపతి డాక్టర్ రాజు, ప్రొఫెసర్లు కృపాల్‌సింగ్, నాగమోహన్, ఇస్మాయిల్‌లో కూడిన 12 మంది వైద్య బృందం పోస్టుమార్టం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టుమార్టం పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. ఐదు మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు.