వికార్ గ్యాంగ్‌కు అంత్యక్రియలు
- హైదరాబాద్‌లో భారీ బందోబస్తు
- నలుగురి మృతదేహాలకు వేర్వేరు చోట్ల అంత్యక్రియలు
- భారీగా తరలివచ్చిన పాతబస్తీ ప్రజలు
హైదరాబాద్: వరంగల్, నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన వికారుద్దీన్, సయ్యద్ అమ్జద్, మహ్మద్ జకీర్, మహ్మద్ హనీఫ్ మృతదేహాలను అంబులెన్స్‌లో సాయంత్రం 4.45 గంటలకు వరంగల్ నుంచి ఓల్డ్‌మలక్‌పేటలోని వికారుద్దీన్ ఇంటికి భారీ బందోబస్తు మధ్య పోలీసులు తీసుకువచ్చారు.
అనంతరం దాదాపు గంటన్నరపాటు బంధువుల సందర్శనార్థం మృతదేహాలను అక్కడే ఉంచారు. 6.30కి వాహెద్‌నగర్‌లోని నూర్‌మసీద్‌కు తరలించి ప్రార్థనలు జరిపారు. అక్కడి నుంచి 7.40కి యాత్రగా నగరంలోని వివిధ శ్మశాన వాటికలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. హనీఫ్ మృతదేహానికి కాస్త ఆలస్యంగా ముషీరాబాద్‌లో అంత్యక్రియలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ఆయన తల్లి, సోదరులు వచ్చే వరకు ఆగారు.
నగరంలో టెన్షన్.. టెన్షన్: వికారుద్దీన్ ఇంటి చుట్టూ దాదాపు వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల సూచనల మేరకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను అనుసరించారు. అలాగే ఇతర ఉగ్రవాదుల ఇళ్ల వద్ద నుంచి కూడా శవయాత్రకు రూట్‌మ్యాప్‌ను ముందే నిర్దేశించారు. 2 జోన్ల పరిధిలోని ప్రాంతాలను పోలీసులు అడుగడుగునా పహారా కాశారు.
మృతదేహాలను చూసేం దుకు బంధువులు, పాతబస్తీ ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ఓల్డ్‌మలక్‌పేట నుంచి సంతోష్‌నగర్ వైపు, ఎంజీబీఎస్ నుంచి సుల్తాన్‌షాహీ వైపు రెండు మార్గాల్లో వేర్వేరు వాహనాల్లో మృతదేహాలను తరలించారు. బాధిత కుటుంబాలను మజ్లిస్ నేతలు పరామర్శించారు.
కాగా, మహ్మద్ హనీఫ్ అంత్యక్రియలకు ముందు భౌతికకాయానికి మసీదులో ప్రార్థనలు చేయాల్సి ఉండగా అందుకు కొందరు ముస్లిం పెద్దలు నిరాకరించినట్లు సమాచారం. అలాగే మిగతావారి విషయంలో ఖననం చేయడానికి శ్మశాన వాటికల నిర్వాహకులు అభ్యంతరాలు చెప్పినా పోలీసుల జోక్యంతో ఆ ప్రక్రియ పూర్తయింది. కాగా, హనీఫ్ మృతదేహాన్ని నగరంలోని అతని అత్తగారింటికి తీసుకువచ్చిన పోలీసులపై, మీడియాపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.