వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి | given to the report on encounter vikaruddin - National Human Rights Commission | Sakshi
Sakshi News home page

వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి

Published Fri, Apr 24 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి

వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి

డీజీపీకి జాతీయ హక్కుల కమిషన్ ఆదేశం
మెజిస్టీరియల్, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ వివరాలివ్వండి

 
హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఇక్కడి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ భవనంలో బాలకృష్ణన్ అధ్యక్షతన సభ్యులు సైరియర్ జోసెఫ్, జస్టిస్ డి .మురుగేశన్, ఎస్పీ సిన్హాతో కూడిన పూర్తిస్థాయి కమిషన్ ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలను కమిషన్ ఆలకించింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, పక్కా ప్రణాళిక ప్రకారమే వికార్, అతని అనుచరులను కాల్చి చంపారని వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తోపాటు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమిషన్ విచారణ సందర్భంగా వాదించారు.

అయితే తమ ఆయుధాలు లాక్కొని దాడి చేసేందుకు ప్రయత్నించడం వల్లనే ఆత్మరక్షణకు కాల్పులు జరపాల్సి వచ్చిందని వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు ఎంతో ప్రమాదకారులని, గతంలో నలుగురు పోలీసులను హత్య చేశారని కమిషన్ దృష్టికి తెచ్చారు. కాగా, మృతుల్లో ఒకరైన విచారణ ఖైదీ జకీర్‌ను ఒక రోజు ముందుగానే హైదరాబాద్ నుంచి వరంగల్‌కు తరలించారని వికారుద్దీన్ తండ్రి పేర్కొనగా, దీని పూర్వాపరాలపై కమిషన్ ఆరా తీసింది. ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పరిధిలో దీని విచారణ కొనసాగుతున్నందున, మళ్లీ విచారణ అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ కేసును కూడా తమకే బదిలీ చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. పోలీసుల ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నదన్న వికార్ తండ్రి వాదనపై కమిషన్ స్పందిస్తూ.. ఏ ప్రాతిపదికన ఈ వాదన చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ హతుల ఫొటోలను చూస్తేనే అర్థమవుతోందని.. కాళ్లకు, చేతులకు బేడీలు వేసి సీటుకు తాళం వేశారని, అలాంటి  పరిస్థితిలో 17 మంది పోలీసులుండగా ఆయుధాలు లాక్కోవడం అసాధ్యమని వికార్ తండ్రి పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ మూడేళ్ల క్రితమే వికారుద్దీన్ కోర్టుకు విన్నవించుకున్నట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు.

తనను మరో జైలుకు తరలించాలని కూడా కోరినట్లు గుర్తుచేశారు. నేరస్తులు, స్మగ్లర్లు, టైస్టులు, నక్సలైట్లకు కూడా మానవహక్కులు ఉంటాయని, వాటిని కాలరాసి ఏకంగా అంతమొందించడం ఎంతమాత్రం సరికాదని పౌర హక్కుల సంఘం నేతలు రమా మెల్కొటే, జయవింధ్యాల, ఎస్. జీవన్‌కుమార్ తదితరులు కమిషన్ దృష్ఠికి తీసుకొచ్చారు. మరోవైపు ఈ  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాలని, అందుకు దారితీసిన కారణాలు తెలియాలని తాము కూడా కోరుకుంటున్నట్లు ఐజీ నవీన్‌చంద్ తెలిపారు.
 
రైతు ఆత్మహత్యలపై కూడా..
 
 రాష్ట్రంలో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాలకు అందిన సహాయం, పరిహారం తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. గురువారం బహిరంగ విచారణ సందర్భంగా మెదక్ జిల్లా గజ్వేలు, తొగుట, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామ మండలం నుంచి ఆత్మహత్యలు చేసుకున్న ఏడు రైతుకుటుంబాల సభ్యులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. రాష్ర్టంలో 748 మంది ైరె తులు ఆత్మహత్యలు చేసుకోగా వారి సంఖ్య 96 మాత్రమేనని అధికారులు పేర్కొనడం సరికాదని వివిధ పౌరహక్కుల నేతలు కమిషన్ ముందు అభ్యంతరాన్ని  వ్యక్తంచేశారు. కాగా రైతు కుటుంబాల తరఫున ఎస్. ఆశాలత (రైతు స్వరాజ్యవేదిక), కె.సజయ (కేరింగ్ సిటి జన్స్ కలెక్టివ్), జీవన్‌కుమార్ (మానవ హక్కుల వేదిక), ఓపీడీఆర్, రైతు ఆత్మహత్య బాధితుల కుటుంబాల వేదిక, తెలంగాణ రైతు రక్షణ సమితి, మహిళా కిసాన్ అధికార్ మంచ్‌ల ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా వివరణనిచ్చారు. రైతులు పంట నష్టపోయినపుడు నిబంధనల ప్రకారం సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.  
 
హైకోర్టు విచారణ 28కి వాయిదా
 
వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖ లు చేసేందుకు గడువు కావాలని రాష్ర్ట ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించడంతో పాటు, కేసు దర్యాప్తును సీబీ ఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తో పాటు మృతుల సంబంధీకులైన మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను గతవారం విచారించిన కోర్టు.. కౌం టర్ దాఖలు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement