
శంకరపట్నం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయించవద్దని మహిళలు నిషేధం విధించారు. ఆదివారం నుంచి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 50 వేలు, మద్యం సేవిస్తే రూ.5 వేలు జరిమానా, మద్యం అమ్మినవారిని పట్టిస్తే రూ.10 వేల బహుమతి అందిస్తామని వైస్ ఎంపీపీ కొయ్యడ పరశురాములు, మహిళలు ముక్తకంఠంతో ప్రకటించారు. గద్దపాకలో మద్యం తాగుడు, అమ్మకాలు బంద్ చేయాలని కోరుతూ మహిళలంతా ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. మద్య నిషేధం అమలు చేయాలని గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీసులకు సమాచారమిచ్చారు. గద్దపాకలో 11 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయని.. కూలీ డబ్బులు మద్యం తాగేందుకే ఖర్చుచేస్తున్నారన్నారు.
డబ్బులు లేకున్నా పర్లేదు మందు ఇస్తామని బెల్ట్‌షాపు నిర్వాహకులు ఫోన్ చేసి మరీ మద్యానికి బానిసలను చేస్తున్నారన్నారు. ఒక్కొక్క బెల్ట్‌షాపులో రైతుల ఖాతాలు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు ఉన్నాయని మహిళలు కంటతడి పెట్టారు. ఇంట్లో భార్యలు కూలీకి వెళ్లి పత్తి ఏరితే వచ్చిన రూ.100 కూలీ డబ్బులు కూడా తాగుడుకు ఇవ్వమని భర్తలు గొడవ పడుతున్నారన్నారు. గ్రామంలో 80 శాతం పైగా మద్యానికి బానిసలయ్యారని వీఆర్‌వో తెలిపారు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వచ్చిన జీతంలో తన భర్త రూ.5 వేల మద్యం తాగేందుకు ఖర్చు చేస్తున్నాడని మద్యం అమ్మకాలు లేకుండా చేయాలని ఎస్సై శ్రీనుకు మొరపెట్టుకున్నారు. కాగా, గద్దపాకలో మహిళలు మద్య నిషేధం ప్రకటించారని దీనికి అందరూ సహకరించాలని కేశవపట్నం ఎస్సై సూచించారు. మద్యం అమ్మకాలు చేస్తే కేసు లు నమోదు చేస్తామన్నారు.
తాగి.. మంచం పట్టిండు
నా భర్తను మద్యం తాగుడుకు బానిసను చేసిండ్రు. మద్యం తాగి.. షుగర్ వ్యాధితో లేవకుండా మంచం పట్టిండు. పోరగాండ్లు తాగుడుకు బానిసలు అవుతుండ్రు. గద్దపాకలో మద్యం అమ్మితే, దాడులు చేసి మద్యం సీసాలు పగులగొడుతం.
– భాగ్యలక్ష్మి
ఇద్దరు చనిపోయిండ్రు
మా ఇంట్లో ఇద్దరు మద్యానికి బానిసలై చనిపోయిండ్రు. మా ఊళ్లో 18 ఏండ్ల పోరగాండ్లను కూడా తా గుడుకు బానిసలను చేత్తండ్రు. బెల్ట్‌షాపోళ్లు సంపాదన కోసం పేదోళ్లు, రైతులకు మద్యం అలవాటు చేయించి డబ్బులు లాగుతుండ్రు.
– పుష్పలత