సాక్షి, హైదరాబాద్: బీజేపీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపడం లేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలను కూడగడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
బాధ్యత గల సీఎం సీఏఏను అపహాస్యం చేసేలా మట్లాడటం ఎంతవరకు సబబని కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద రాజకీయ వాదులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ కుట్రలో కేసీఆర్ పావులా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం జనగణనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment