
వ్యవసాయానికి 9గంటల కరెంట్
రైతులకు భవిష్యత్‌లో 24గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు ....
► భవిష్యత్‌లో నిరంతర సరఫరా
► మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి
► హేమసముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
► రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి
హన్వాడ : రైతులకు భవిష్యత్‌లో 24గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నా రు. గురువారం స్థానిక సబ్‌స్టేషన్‌లో మంత్రు లు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతులకు 9గంటల విద్యు త్ విధానాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతం 30ఏళ్లపాటు అంధకారంగా ఏర్పడుతుందని ఎద్దేవా చేశారన్నారు. గత ఏడుగురు ముఖ్యమంత్రులు చేయలేని నిరంతర విద్యుత్‌ను మన సీఎం కేసీఆర్ కేవలం మూడు నెలల్లోనే చేసి చూపారన్నారు. ఆంధ్ర పాలనలోని 2005-12 మధ్యకాలంలో జిల్లాలో కరెంటు కాటుకు 1630మంది చనిపోయినట్లు జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ రైతుల కోసం 9గంటల నిరంతర విద్యుత్‌ను అమలు చేశారన్నారు. 9గంటల విద్యుత్ సరఫరా కోసం రూ. 182కోట్లతో జిల్లాలోని అన్ని సబ్‌స్టేషన్ల స్థాయిని పెంచడం జరిగిందన్నారు. ఇందుకోసం 12వేల స్తంభాలు, 108పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
హేమసముద్రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
పాలమూరు ఎత్తిపోతల కింద హన్వాడ మండలంలోని హేమసముద్రం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కొందరు తమ స్వార్థం కోసం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారన్నారు. అయినా ప్రాజెక్టును నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు.
స్థానికులు అడగక ముందే ఇక్కడి రైతుల సమస్యలను గుర్తించి హేమసముద్రం ప్రాజెక్టు నిర్మాణానికి విశ్వప్రయత్నాలు చేశానన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హేమసముద్రం ప్రాజెక్టును కట్టితీరుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ రాముడు, ఏడీ శ్రీనివాస్, ఎంపీపీ విజయలక్ష్మీ, వైస్ ఎంపీపీ దస్తయ్య, సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీలు రాధ, ఆంజనేయులు, మహబూబ్‌నగర్ ఏఈ రాజ్‌ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.