ప్రాణం తీసిన ‘మిస్డ్ కాల్’
కుత్బుల్లాపూర్: వేకువజామున వచ్చిన ఓ మిస్డ్ కాల్ మహిళ మృతికి కారణమైంది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్‌రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగుర్తికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి ఉంటున్నారు.
కనకవ్వ స్థానికంగా ఉన్న ఓ సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తె నవ్వ(8) ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను తీవ్రంగా చితకబాదాడు.
పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. దెబ్బలకు తాళలేక కనకవ్వ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను పేట్ బషీరాబాద్‌లోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చి న మిస్డ్ కాల్ నంబరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.