సంగారెడ్డి రూరల్: అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగాలంటే పన్ను వసూళ్ల కూడా అదేస్థాయిలో చేయాలని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వందశాతం పన్ను వసూళ్లు చేసిన గ్రామ పంచాయతీకి రూ.2 లక్షల ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి మండ లం ఫసల్‌వాది శివారులో రూ.2.20 కోట్లతో నిర్మించనున్న జిల్లా పంచాయతీ రాజ్ శిక్ష ణ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పంచాయతీ రాజ్ చట్టాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు సర్కార్ కృషిచేస్తోందన్నారు.
త్వరలో నిర్మించనున్న జిల్లా పంచాయతీ రాజ్ శిక్ష ణ కేంద్రం ఈ అవగాహన కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవనంలో జిల్లాలోని 1,066 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పూర్తి స్థాయి శిక్ష ణ కల్పిస్తామన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ భవనాలకు అవసరమైన చోట మరమ్మత్తులు చేయించడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న వాటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపడతామన్నారు. ఇటీవల జిల్లాలో 25 గ్రామ పంచాయతీలకు నిర్మల్ పురస్కార్ అవార్డులు లభించడం గర్వకారణమన్నారు. మిగితా గ్రామ పంచాయతీలో కూడా ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి 100 శాతం పారిశుద్ధ్యం సాధించి నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డులు పొందేందుకు కృషిచేయాలన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 24 మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. అందువల్లే ఇంటింటికి నల్ల అందించేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌రాజమణి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులకు సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పంచాయతీ శిక్షణ కేంద్ర భవనం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
కలెక్టర్ రాహుల్ బొజ్జా, మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లా పంచాయతీ రాజ్ శిక్షణ కేంద్ర భవన నిర్మాణం కోసం మంత్రి హరీష్‌రావు ఎంతో కృషి చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సహకారం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, తహశీల్దార్ గోవర్దన్, ఎంపీడీఓ సరళ, గ్రామ సర్పంచ్ సాయమ్మ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నరహరిరెడ్డి, అశోక్, కొండల్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
‘పన్ను’ వసూళ్లపై ప్రత్యేక దృష్టి
Published Fri, Dec 12 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement