రెండున్నరేళ్లు.. 4.5 కిలోమీటర్లు!
• నత్తనడకన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు
• ఇంకా రూ.650 కోట్ల పనులు ఎక్కడికక్కడే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకుని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించేం దుకు చేపట్టిన ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ –ఎస్‌ఎల్‌బీసీ)’ సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి పన్నెండేళ్లు గడుస్తున్నా 70% పనులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. మొత్తం టన్నెల్ పనులు పూర్తయ్యేందుకు మరో ఎనిమిదేళ్లు పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
30 టీఎంసీల నీటిని తీసుకునేలా..
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకునేలా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. 2005 ఆగస్టులో దీనికి టెండర్లు పిలవగా రూ.1,925 కోట్లకు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. 2010 నాటికే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉన్నా... భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా... మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా.. ఇప్పటికి 27.91 కి.మీ. టన్నెల్ పూర్తయింది.
ఏడాదికి 2 కిలోమీటర్ల కన్నా తక్కువే..!
రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా.. తర్వాత రెండున్నరేళ్లలో తవ్వింది 4.83 కిలోమీటర్లే. అంటే ఏడాదికి సగటున 2 కి.మీ. కన్నా తక్కువగానే పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిగతా 15.98 కి.మీ. పనులు జరిగేందుకు మరో 8 ఏళ్లు పడతాయన్నది నీటి పారుదల వర్గాల అంచనా. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుం డగా... శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వెయర్ బెల్ట్ మార్చా ల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావ డంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. పైగా టన్నెల్ తవ్వకం ఆలస్యమవుతోంది. ఇక నల్లగొండ జిల్లా పరిధిలో తవ్వాల్సిన రెండో సొరంగం పూర్త యినా.. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం గా ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1,298.91 కోట్లు ఖర్చు చేయగా.. 67.46 శాతం పనులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రాజెక్టుకు 343.35 కోట్లు కేటాయించినా.. ఎస్కలేషన్ చెల్లింపుల కోసమే రూ.235.16 కోట్లు ఇచ్చారు. మొత్తంగా మరో రూ.635 కోట్ల పనులు పూర్తి చేయాలి.
అమెరికా పర్యటన రద్దు..టన్నెల్ ఆసియా సదస్సుకు హాజరు!
టన్నెల్ పనులను సీరియస్‌గా తీసుకున్న ప్రభు త్వం... టన్నెల్ పనులు ఎక్కువగా జరుగుతున్న అమెరికాకు ఈఎన్‌సీ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కానీ వీసా సంబం ధిత కారణాలతో అది రద్దయింది. డిజైన్, కన్‌స్ట్రక్షన్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ముంబైలో నిర్వహిస్తున్న టన్నెల్– ఆసియా సదస్సుకు ఇంజనీర్ల బృందాన్ని పంపిం ది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు గురువారం ఈఎన్‌సీ మురళీధర్, నాగార్జున సాగర్ సీఈ సునీల్, ప్రాణహిత సీఈ హరిరామ్, మరో ఇద్దరు ఇంజనీర్లు హాజరయ్యారు. టన్నెల్ నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలు, వేగంగా పనులు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.