‘ఉపాధి’కి ఆధార్ లింకు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉపాధి హామీ పథకం కూలీలపై ఆధార్ పిడుగు పడింది. ఇప్పటికే బయోమెట్రిక్ విధానం ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిస్తుండగా.. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామీ జాబ్‌కార్డుకు ఆధార్ నంబరును అనుసంధానం చేస్తోంది. ఇక నుంచి జాబ్‌కార్డుకు ఆధార్ నంబరు అ నుసంధానమై ఉంటేనే కూలీలకు డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. లేదంటే అంతే సంగతులు. కూలీ చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ విధానమని ప్రభుత్వం చెబుతున్నా.. పని ఎక్కడ దొరక్కుండా పోతుందోనని కూలీ లు ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి హామీ కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ నం బరు అనుసంధానాన్ని ముడిపెట్టడంతో.. అనుసంధానం కాని కూలీల డబ్బులు త్వరలో నిలిచిపోనున్నాయి. అతి త్వరలో ఆధార్ అనుసంధానమైన కూలీ లకే డబ్బు చెల్లింపులు చేయనుంది.
జిల్లాలో 11.87 లక్షల కూలీలు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో 5,35,120 జాబ్‌కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. వీటి ద్వారా 11లక్షల 87 వేల 180 మంది కూలీలు పనులు చేస్తున్నారు. గతంలో మాన్యువల్ విధానం ద్వారా కూలీలకు చెల్లింపులు జరిగేవి.
ఆ సమయంలో కూలీలు పనులకు హాజరు కాకున్నా వారి పేరిట సిబ్బంది డబ్బులు డ్రా చేశారన్న ఆరోపణలు పెద్దయెత్తున వచ్చాయి. తద్వారా నిధులు పక్కాదారి పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం మాన్యువల్ చెల్లింపుల స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో కూలీల వేలి ముద్రల ఆధారంగా డబ్బులు చెల్లిస్తున్నారు.
జాబ్‌కార్డులకు ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం ద్వారా చెల్లింపుల్లో అక్రమాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని ప్రభుత్వం భావి స్తోంది. కొద్ది రోజుల నుంచే అనుసంధానం ప్రారంభించా రు. ఇప్పటివరకు ఆరు లక్షల మంది కూలీల ఆధార్ నంబరు(యూఐడీ)తో అనుసంధానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో ఐదు లక్షలకు పైగా కూలీలకు చెందిన ఆధా ర్ నంబర్లు అనుసంధానం కావాల్సి ఉంది.
సాంకేతిక, ఇతర కారణాల వల్ల ఇప్పటికీ ఆధార్‌కార్డులు రానివారు ఉన్నారు. ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధార్‌పై అవగాహన లేక ఫొటో దిగని వారూ ఉన్నారు. దాదాపు లక్షన్నర మంది కూలీలు ఆధార్‌కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఆధార్‌కార్డులు రాక నంబరు అనుసంధానం కాకుంటే పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది.
భారం తగ్గించుకోవడానికేనా..?
వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత కోసమే నూతన విధానమని చెబుతున్నప్పటికీ ఖాజానాపై భారం తగ్గించుకోవచ్చనే భావనతోనే ప్రభుత్వం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు అరికట్టడం మంచిదే అయినప్పటికీ జిల్లాలో పూర్తి స్థాయిలో ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అదేమీ లేకుండా ఆధార్‌తో జాబ్‌కార్డులకు ముడిపెట్టడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూలీలందరికీ ఆధార్ కార్డులు అందజేశాక ఈ విధానాన్ని అమలు చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదని కూలీలు అంటున్నారు. లక్షల మంది ఉపాధిపై ప్రభావం చూపే ఆధార్ అనుసంధానం వాయిదా వేయడం గానీ పూర్తిగా తొలగించడం గానీ చేయాలని కూలీలు కోరుతున్నారు.