సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల ‘డబ్బు’ల్ ధమాకా లభించనుంది. రాష్ట్ర ప్రభు త్వం ఆసరా లబ్ధిదారులకు రెట్టింపు చేసిన పింఛన్లు ఈ నెలలోనే వారి ఖాతాల్లో చేరనున్నాయి. ఈ నెల 22 నుంచి బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాల్లోకి ఈ పింఛన్లు బదిలీ కానున్నాయి. ఇప్పటికే మే నెలకు సంబంధించిన పాత పింఛన్లు వారికి అందజేయగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జూన్ నుంచి చెల్లించాల్సిన రెట్టింపైన పింఛన్ల మొత్తాన్ని కూడా ఈ నెల 22 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మే నెలకు సంబంధించిన పాత పింఛన్‌తో పాటు జూన్ నెలకు పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులు అందుకోనున్నారు. ఇలా ఒకే నెలలో రెండు పింఛన్లు వారికి అందనున్నాయి.
ఇప్పటివరకు ఒక నెల అంతరంతో పింఛన్లు ఇస్తుండటంతో జూన్‌కు సంబంధిం చిన మొత్తం ఆగస్టులో అందుతుందని లబ్ధిదారులు భావించారు. అయితే పెరిగిన పింఛన్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని, జూలై 1న లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఈ నెలలోనే పెంచిన పింఛన్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండురోజుల పాటు సాగిన శాసనసభ, మం డలి సమావేశాలు ముగియడంతో శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రెట్టింపు చేసిన పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగులకు రూ. 1,500 నుంచి రూ.3,016, ఇతర లబ్ధిదారులకు రూ.వెయ్యి నుంచి రూ.2,016 చొప్పు న పింఛన్ పెంచిన విషయం తెలిసిందే.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి 2014, నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.1,500, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద మొత్తం 38,99,044 మందికి పెంచిన ఆసరా పింఛన్లు అందనున్నాయి. అంతేకాకుండా వృద్ధాప్య పింఛన్లు పొందే అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి వివిధ పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ప్రస్తుత వయస్సు తగ్గింపుతో మరో 8 లక్షల మంది వరకు అదనంగా చేరతారని అధికారుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment