
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ఆసరా లబ్దిదారుల ఎంపికపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తరచూ సమస్యలు ఎదురవుతుండటంతో లబ్ధిదారుల జాబితా తుది అంకానికి చేరుకోవడం లేదు. అసరా అర్హుల జాబితా రెవెన్యూ నుంచి జీహెచ్‌ఎంసీ చేతికి అంది ఆరునెలలు గడిచినా తుది జాబితా రూపకల్పనపై స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం విధితమే. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించింది. దీంతో అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా ఆధారంగా ‘ఆసరా’ వృద్ధాప్య పించన్ల కోసం అర్హుల లెక్క తేల్చారు.
వయస్సు నిర్ధారణకు ఓటరు కార్డును ప్రామాణికంగా తీసుకొని 57 నుంచి 65 ఏళ్ల వయస్సు లోపు వారిని అర్హులుగా గుర్తించారు. 6 మాసాల క్రితమే కొత్త నిబంధల ప్రకారం ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తించాలని అధికార యంత్రాంగాలకు ఆదేశాలు అందాయి. ఆసరా పింఛన్ల అర్హతపై గతంలో జారీ అయిన జీఓ 17కు అనుగుణంగా తాజాగా మరో జీవో జారీ అయింది. వయస్సు సడలింపు మినహా మిగిలిన నిబంధనలు య«థాతధంగా ఉండటంతో ప్రస్తుతం ఆసరా పింఛన్లను పర్యవేక్షిస్తున్న విభాగాలు అర్హులైన వారిని గుర్తించి ప్రాథమిక జాబితా రూపొందించారు. ఓటరు జాబితా ఆధారంగా పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. అయితే అంతలో వరుస ఎన్నికలు, కోడ్ అమలులో ఉండడం తదితర కారణాలతో అర్హుల జాబితా తుది అంకానికి చేరలేదు.
నాలుగు లక్షల పైనే...
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ రెవెన్యూ జిల్లాలో 57 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు గల వారు నాలుగు లక్షల పైగా> ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్‌లో మొత్తం 1,50,401 వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు ఉండగా, అందులో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో 58, 575, రంగారెడ్డి జిల్లాలో 60,129, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 31697 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. వయోపరిమితి సడలింపుతో వారి సంఖ్య మూడింతలు పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పింఛన్ దారులతో కలిపి సంఖ్య రెట్టింపు కావచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment