మృతుడు కటికె శంకర్ కుటుంబసభ్యులు, వాగులో తవ్వకాల్లో బయటపడిన బ్యాగు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్‌రూరల్ : కరీంనగర్ సమీపంలోని ఇరుకుల్ల వాగులో 29 ఏళ్ల క్రితం అదృశ్యమైన లారీ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. లారీతో పాటు ముగ్గురి అస్థిపంజరాలు దొరికాయి. ముప్పై ఏళ్ల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన లారీ ఆనవాళ్లు ఇసుక తవ్వకాలతో లభించడంతో అధికారుల అనుమతితో లారీ యాజమాని కుటుంబసభ్యులు శనివారం శకలాలు వెలికితీశారు. వాగులో పది అడుగుల లోతులో తుప్పుపట్టిన లారీని వెలికితీయగా క్యాబిన్‌లో ముగ్గురి అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. కుటుంబసభ్యులు, అప్పటి ప్రత్యక్ష సాక్షులు, అధికారుల కథనం ప్రకారం.. 1989 జూలై 23న భారీ వర్షం వరదలతో ఇరుగుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై నుంచి వరద వెళ్లడంతో అప్పట్లో పెద్దపల్లి నుంచి కేశవపట్నంకు వయా కరీంనగర్ నుంచి పశువుల లోడ్‌తో వెళ్తున్న లారీ కొట్టుకోయింది.
లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రైవర్ అబ్దుల ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు. గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యాజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు పశువుల వ్యాపారి ముక్తుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామి ఉన్నారు. మరుసటి రోజే క్రేన్‌తో ప్రయత్నం చేయగా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది.1989 జూలైలో జరిగిన ఈ ఘటనపై క్రెమ్ నంబర్ 160/89గా కేసు నమోదు అయ్యింది. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబసభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో అందరూ మరిచిపోయారు.
‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..
ఇటీవల వాగులో ఇసుక తవ్వకాల చేపట్టగా లారీ ఆనవాళ్లు బయటపడ్డాయి. క్యాబిన్ ముందుగా బయటపడటంతో 1989 నాటి ఘటనను పేర్కొంటూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి కుటుంబసభ్యులు స్పందించారు. ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్‌లతో గల్లంతయిన దౌలత్‌ఖాన్ కుమారుడు రియాజ్‌ఖాన్ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అంతకు ముందు మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి నివేదించడంతో ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో తహసీల్‌దారు రాజ్‌కుమార్ పర్యవేక్షణలో ఇరుకుల్ల వాగులో శుక్రవారం, శనివారం జరిపిన తవ్వకాలలో లారీని వెలికితీశారు. దీంతో లారీ క్యాబిన్ లో చిక్కుకున్న మూడు ఆస్థిపంజరాల ఆనవాళ్లు, కపాలాలు (పుర్రెలు) బయటపడ్డాయి.
రెండు ఆస్థిపంజరాలు ప్రాణాలు కోల్పోయిన దౌలత్ ఖాన్, అతని సోదరుడు ముక్తుంఖాన్ దుస్తులను బట్టి కుటుంబసభ్యులు గుర్తించారు. మరోటి వెంకటస్వామిది కానీ, శంకర్‌ది గానీ అయి ఉంటుందని చెప్తున్నారు. కాగా సుమారు 30 ఏళ్ళుగా వారికోసం నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులకు చివరికి అస్థికలు లభించడంతో బోరున విలపిస్తు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి వాగంతా వెతికినా ఆచూకీ లభించలేదని, చివరకు తమకు డెత్ సర్టిఫికెట్ సైతం ఇవ్వకపోవడంతో లారీ ఇన్స్‌రెన్స్ రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత వాటిని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
అప్పుడు నేను చిన్నదాన్ని
మా నాన్న ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి,తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాం. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నది ఉంటుందని అనుకున్నాం. అపుడు ఎట్లాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– సరిత, కటికె శంకర్ పెద్దకూతురు
ప్రభుత్వం ఆదుకోవాలి
మా నాన్న గొడ్ల వ్యాపారం చేస్తాడు. పెద్దపల్లి అంగడికిపోయి లారీలో తిరిగి వస్తుండగా ఇరుకుల్ల వాగులో కొట్టుకపోయింది. అప్పటి నుంచి మా నాన్న అచూకీ దొరుకలేదు. మా నాన్న లేకపోవడంతో అమ్మ ఎంతో కష్టపడింది. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం రాలేదు. మాది బాగా పేద కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలి.
– గోపి, మృతుడు వెంకటస్వామి కొడుకు
‘సాక్షి’ కి రుణపడి ఉంటాం
మా నాన్న దౌలత్‌ఖాన్ లారీ ఓనరు, పెద్ద నాన్న మగ్ధంఖాన్ గొడ్ల వ్యాపారం చేస్తాడు. అపుడు నేను చిన్న పిల్లగాన్ని. పదిరోజుల క్రితం సాక్షి పేపర్‌లో ఇరుకుల్లవాగులో 30 సంవత్సరాల కిందట పడిపోయిన లారీ ఇసుక తవ్వుతుండగా బయటకు వచ్చినట్లు వార్త రావడంతో మాకు తెలిసింది. సర్పంచును కలిస్తే పోలీసులను కలువమన్నారు. పోలీసులు మాతో కాదని కలెక్టర్‌ను కలువమని చెప్పితే రంజాన్ పండుగ కావడంతో కలువలేదు. మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి చెప్పగా రెవెన్యూ అధికారులకు చెప్పితే తహశీల్దార్‌ను కలిసి పర్మిషన్ తీసుకుని జేసీబీతో తవ్వకాలు చేపట్టాము.
– రియాజ్‌ఖాన్, లారీయజమాని దౌలత్‌ఖాన్ కొడుకు
Comments
Please login to add a commentAdd a comment