
వికారాబాద్: ర్యాలీ నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు
తాండూరు టౌన్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తాండూరులోని అంబేద్కర్‌చౌక్‌లో పెద్దఎత్తున విద్యార్థులు రోడ్డుపై గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈసందర్భంగా ఎబీవీపీ వసతిగృహాల జిల్లా కో–కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూ.1168 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఎంసెట్ స్కాంలో అసలైన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ ధర్నాలో పలు కళాశాలల విద్యార్థులు, ఎబీవీపీ కార్యకర్తలు హరీష్, శ్రీను, నవీన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసలు రాకతో స్వల్ప ఉద్రిక్తత...
విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం, ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి తొలగించేందుకు యత్నించగా అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు విద్యార్థులను శాంతింపజేసి అక్కడనుంచి పంపించారు.
వికారాబాద్‌లో విద్యార్థులతో కలిసి ఏబీవీపీ ర్యాలీ...
వికారాబాద్ అర్బన్ : ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పసుల మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ విషయమై విద్యార్థులతో కలిసి రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ప్రభుత్వం సకాలంలో ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాల మీదనే ఆధారపడి చదివే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజురియింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టించి ఇతర పనులకు వాడుకుంటుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపకారవేతనాలను నెలనెల విద్యార్థుల ఖాతాలో జమచేయాలన్నారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏబీవీపీ నాయకులు సతీష్, అనీల్, వెంకట్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.