ఏసీబీ వలలో ఓ అవినీతి పెద్ద చేప చిక్కింది.. ఓ రైతు నుంచి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్‌కో ఏడీ పెద్దమొత్తంలో డబ్బును లంచంగా డిమాండ్ చేశాడు..
ఏసీబీ వలలో ఓ అవినీతి పెద్ద చేప చిక్కింది.. ఓ రైతు నుంచి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్‌కో ఏడీ పెద్దమొత్తంలో డబ్బును లంచంగా డిమాండ్ చేశాడు.. మొదటి విడతలో కొంత చెల్లించుకున్న బాధితుడు రెండోసారీ ఇచ్చే ముందు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు పట్టుకున్నారు.. వివరాలిలా ఉన్నాయి.
- పెద్దమందడి / కొత్తకోట
పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన ఆవుల శ్రీశైలం వృత్తిరీత్యా రైతు. కొన్నేళ్లుగా లోఓల్టేజీ విద్యుత్ సరఫరాతో పంటలను రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. తనకున్న మూడు వ్యవసాయ బోర్లకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం 2012లో *5400 డీడీ చెల్లించినా ఏడీఈ కామేశ్వర్‌రావు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఏడాది క్రితం వనపర్తి డీఈ కార్యాలయం ఎదుట శ్రీశైలం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. అయినా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇంతలోనే అప్పుడు తీసిన డీడీ తాలూకు రసీదు పొగొట్టుకుపోయింది. దీంతో కొన్నాళ్ల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతు శ్రీశైలం కొత్తకోటలో ఏడీ కామేశ్వర్‌రావును కలిశాడు. అయితే *30వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఇటీవల *పదివేలను రైతు శ్రీశైలం నుంచి ఏడీ తీసుకున్నాడు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడితేగా మంగళవారం మహబూబ్‌నగర్ వెళ్లి కలిశాడు. చివరికి *ఆరు వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని విసిగివేసారిన బాధితుడు మహబూబ్‌నగర్‌లో ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజకు ఫిర్యాదు చేశాడు. చివరకు బుధవారం *మూడువేలు కొత్తకోటలోని విద్యుత్తు కార్యాలయంలో ఏడీ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ దాడిలో సీఐ గోవింద్‌రెడ్డి, మరో ఇద్దరు సిబ్బంది పాల్గొన్నారు.