తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై యాచకుడు నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద గోల్కొండ నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.
- తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు ఢీకొని యాచకుడి మృతి
- మృతదేహాన్ని చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టిన మరో కారు
మహేశ్వరం: తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై యాచకుడు నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద గోల్కొండ నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించగా, ఆ మృతదేహం రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో కీసరకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి శంషాబాద్ నుంచి స్విఫ్ట్ కారులో అటువైపుగా వస్తున్నాడు. రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని చూసి ఆగి పరిశీలిస్తున్నాడు. ఇంతలోనే రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన మరోకారు శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది. దీంతో అతడు కూడా ప్రాణాలు వదిలాడు.
ఈ సంఘటన మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్‌రింగ్ రోడ్డుపై జరిగింది. శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది సైదాబాద్ బోజిరెడ్డి కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకులను పోలీసులు విచారిస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని , మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.