
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖ చేపట్టనున్న ‘జలం జీవం’ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఎక్కువ మందిని భాగస్వాములను చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. శుక్రవారం మెట్రో భవన్‌లో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, సీడీఎంఏ విభాగాల ఉన్నతాధికారులు పొల్గొన్నారు.
మిషన్ భగీరథ అర్బన్‌పైనా మంత్రి సమీక్ష జరిపారు. ఈ పథకంలో చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీకి ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలోని పలు పురపాలికల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలియజేయాలని మంత్రి కోరారు. ఉప్పల్ శిల్పారామం పనులు త్వర గా పూర్తి చేయాలని, పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులకు నిర్ణీత గడువు పెట్టుకోవాలన్నారు.
ఈ గడువులోగా అనుమతులు ఇవ్వకుంటే టియస్ ఐపాస్ అనుమతుల మాదిరి ఆటోమేటిగ్గా అనుమతులు వచ్చినట్లు భావించి పనులు ప్రారంభించుకునేలా చూడాలన్నారు. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియలో ఆలస్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానాలు విధిం చాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రైవేటు పార్కింగ్‌కు అవకాశాలపై ప్రచారం కల్పించాలని, మల్టీ లెవల్ పార్కింగ్‌కు టెండర్లు పిలవాలన్నారు. నగరంలో వంద ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులను ప్రారంభించాలన్నారు. నగరంలో వచ్చే ఏడాదిపాటు రోడ్డు కటింగ్‌లకు అనుమతులు ఇవ్వవద్దన్నారు.
ఇసుక రవాణా మరింత పారదర్శకం
ఇసుక రవాణా మరింత పారదర్శకంగా సాగేందుకు రాష్ట్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ బృందాల్లో ఉంటారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మైట్రో రైలు కార్యాలయంలో కేటీఆర్ గనుల శాఖపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు, వాటి సరఫరాలో మరింత పారదర్శకత ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment