సాక్షి, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా శ్రీరామ దివ్య క్షేత్రం రామనామ సంకీర్తనలతో మార్మోగుతోంది. వేడుకల్లో భాగంగా తొలుత పగల్‌పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం మత్స్యావతారం, 20న కూర్మావతారం, 21వరాహావతారం, 22న నృసింహావతారం, 23న వామన, 24న పరుశురామ, 25న శ్రీరామావతారం, 26న బలరామ, 27న శ్రీ కృష్ణావతారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి జనవరి 8 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రభాకర శ్రీనివాస్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. జనవరి 13న విశ్వరూప సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. రామాలయాన్ని సోమవారం రాత్రే విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనానికి రూ.1000, రూ.500, రూ.250 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.