
విలేకరులతో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్/ఆసిఫాబాద్/ఉట్నూర్: ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు బలగాలను భారీగా మోహరించినప్పటికీ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఒకవైపు పోలీసు పహారా కొనసాగుతుండగా, మరోవైపు ఘర్షణలు జరుగుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులతోపాటు బలగాలకు కూడా కంటి మీద కునుకు లేకుండాపోయింది. స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే సిరికొండ మండలం రాంపూర్‌తండాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం గమనార్హం. రాంపూర్ తండాలో ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన ఆస్తులకు నష్టం కలిగించటంతో పాటు పత్తి నిల్వలను దహనం చేశారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసినప్పటికీ పహారా లేని తండాలో ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి. కాగా, రెండు రోజుల కిందట ఘర్షణల సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉట్నూర్ మండలం హస్నాపూర్‌కు చెందిన రాథోడ్ జితేందర్ అంత్యక్రియలు గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నిర్వహించారు. లంబాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేతలు అమర్‌సింగ్ తిలావత్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తదితరులు హాజరయ్యారు.
మావోయిస్టులు అనుకూలంగా మలుచుకునే అవకాశం: డీజీపీ
ఆదివాసీ, లంబాడీల ఘర్షణలను మావోయిస్టులు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఉట్నూర్‌కు వచ్చారు. అదనపు డీజీపీ అంజనీకుమార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆయనతో వచ్చారు. ఉట్నూర్‌లోని హస్నాపూర్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని, ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో పర్యటించి తిరిగి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఉట్నూర్, ఆదిలాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఘర్షణలను ముందుండి, వెనుకుండి నడిపేవారిని వదిలేది లేదని, బాధ్యుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టామని వివరించారు. కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, పోలీసు అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, అన్ని శాఖలను సమన్వయం చేసుకొని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుస్థిర శాంతిని స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజాఫిర్యాదులను అర్థం చేసుకొని అందరి మనోభావాలను గౌరవిస్తామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎస్పీలుగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు మహేశ్ ఎం.భగవత్, తరుణ్‌జోషి, అనిల్‌కుమార్, దేవేంద్రసింగ్ చౌహాన్, ప్రమోద్‌కుమార్ ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో భద్రత చర్యలను పర్యవేక్షిస్తుండడం గమనార్హం.