సర్వం కల్తీమయం | adulteration of everything | Sakshi
Sakshi News home page

సర్వం కల్తీమయం

Published Mon, Jul 28 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

adulteration of everything

ఆదిలాబాద్ రిమ్స్ :  కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. మార్కెట్‌లో లభించే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. తినే తిండిలో.. తాగే పాలల్లో.. వాడే దినుసుల్లో.. ఇలా..  సర్వం కల్తీమయమే. కళ్లకు కనిపించని విధంగా కల్తీ చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో లభించే వస్తువుల్లో ఏది స్వచ్ఛమైనదో చెప్పలేని పరిస్థితి ఉంది. కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థం వ్యక్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపే ప్రమాదముంది. అయితే కొంత అప్రమత్తత, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కల్తీని గుర్తించడం సాధ్యమే. ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా.. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ప్రధానంగా కల్తీ జరిగే వస్తువులు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, కల్తీని గుర్తించే విధానంపై కథనం..
 నూనెలు..
 కొబ్బరి నూనెలో ఆముదం కలిపి కల్తీ చేస్తారు. ఆముదం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కానీ.. కొబ్బరి నూనె కంటే ఆముదం ధర తక్కువ ఉండడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
 గుర్తించడం ఇలా.. : ప్రయోగశాలల్లో అయితే రసాయనాలతో పరీక్షిస్తారు. అదే ఇంటి దగ్గరైతే చేతితో పట్టుకున్నప్పుడు బాగా జిడ్డుగా ఉన్నట్లయితే ఆముదం కలిపినట్లుగా గురించొచ్చు.

 కారం..
 కారం ఎర్రగా ఆకర్షణీయంగా ఉండడానికి కొన్ని రకాల రంగులు కలుపుతారు. రంపపు పొట్టుతోనూ కల్తీ చేస్తారు. దీనివల్ల ఎలర్జీ, నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక కూర పొడుల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు. ధనియాల పొడిలో ఎక్కువ ఉప్పు కలుపుతారు.

 గుర్తించడం ఇలా.. : రెండు గాజు పాత్రల్లో నీళ్లు తీసుకుని కారం, ధనియాల పొడిని చెంచా చొప్పున వేయాలి. కల్తీ జరిగి ఉంటే రంపం పొట్టు నీటిపై తేలుతుంది. ఇటుక పొడి వంటివి అడుగున పేరుకుంటాయి. ఇలా కాకుండా నీటిలో కలిసిపోతే అవి స్వచ్ఛమైనవని గుర్తించాలి.

 నెయ్యి..
 స్వచ్ఛమైనదని మురిసిపోతూ మనం తెచ్చుకునే నెయ్యిలో ఎక్కువ భాగం వనస్పతి కలుపుతున్నారు. వనస్పతి వంటి  నెయ్యి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

 గుర్తించడం ఇలా.. : ఐదు మిల్లీలీటర్ల నెయ్యిలో 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోమిక్ ఆమ్లం కలపండి. కొద్దిగా చక్కెర చేర్చండి. అప్పుడు నెయ్యి ఇటుక రంగులోకి, ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే.

 కాఫీ పొడి..
 కాఫీ పొడిలో సాధారణంగా వేయించిన ఈత గింజల పొడి, చింత గింజల పొడి కలిపి కల్తీ చేస్తుంటారు.
 గుర్తించడం ఇలా..: కొంచెం కాఫీ పౌడర్‌ను నీళ్లలో వేస్తే.. మంచిదైతే పైన తేలుతుంది. లేదంటే అడుగున పేరుకుపోతుంది.

 కందిపప్పులో కేసరి..
 కందిపప్పులో కేసరి పప్పు (లంకపప్పు ) కలిపి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కందిపప్పులో కలిపే గడ్డిశెనగ పప్పు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

 గుర్తించడం ఇలా.. : కొద్దిగా కందిపప్పు తీసుకొని నీళ్లలో పది నిమిషాలు ఉంచాలి. నీరు రంగు మారితే కల్తీ జరిగినట్లే.

 తేనె..
 మార్కెట్‌లో సీలు లేకుండా పెద్దపెద్ద సీసాల్లో తేనె అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా బెల్లం పానకమే ఉండే అవకాశం ఉంది.

 గుర్తించడం ఇలా.. : ముందుగా శుభ్రమైన వస్త్రం ముక్కను మీరు కొన్న తేనెలో కలిపి అగ్గిపుల్లతో వెలిగించండి. స్వచ్ఛమైన తేనె అయితే మంట పెరుగుతుంది. లేదంటే కొంచెం కాలిన తర్వాత ఆరిపోతుంది. లేదా గాజు పాత్రలో నీళ్లు తీసుకొని అందులో చెంచా తేనె వేయండి. పాకం అయితే కరిగిపోయి నీటి రంగులోకి మారుతుంది. అదే స్వచ్ఛమైన తేనె అయితే వేసినచోటే అలా ముద్దలా ఉండిపోతుంది.

 పాలు..
 పాలు చిక్కగా కనిపించడం కోసం బియ్యం పిండి గంజి కలుపుతారు. ఇలా చేస్తే చూడడానికి చిక్కగా ఉంటాయి. ఆరోగ్యపరంగా నష్టం కలగకపోయినా ఆర్థికంగా నష్టమే.  

 ఇలా గుర్తించాలి..: చిన్న పాత్రలో కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానికి నాలుగైదు చుక్కల అయోడిన్ కలపాలి. అప్పుడు పాలు నీలి రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే.

 చక్కెర..
 చక్కెరలో ఎక్కువ బొంబాయి రవ్వ కలిపి కల్తీ చేస్తారు.
 గుర్తించడం ఇలా.. : పాలు లేదా నీళ్లలో చెంచా చక్కెర వేయాలి. అందులో రవ్వ కలిపి ఉంటే అడుగున తెల్లని పొర ఏర్పడుతుంది.

 కోవా, జున్ను, పాలపొడి..
 కోవా, జున్నుల్లో బియ్యం పిండితో కల్తీచేస్తారు. పాల పొడిలోనూ బియ్యం పిండి కలుపుతారు.
 గుర్తించడం ఇలా..: కొద్దిగా జున్ను తీసుకుని అయోడిన్ కలపాలి. నీలం రంగు కనిపిస్తే అందులో బియ్యం పిండి కలిపినట్లే.

 వక్కపొడి..
 వక్కపొడిలో రంపపు పొట్టు కలుపుతారు. వీటికి ముదురు రంగలనూ కలుపుతారు.
 గుర్తించడం ఇలా..: కొద్దిగా వక్కపొడి చేతిలో తీసుకుని గట్టిగా నలిపితే రంగు అంటుకుంటే కల్తీ జరిగిందని భావించాలి. లేదా నీటిలో వేసి చూసినా రంగు వెంటనే కరిగిపోతుంది. నీళ్ల రంగు మారుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement