ఉప‘యోగా’లెన్నో..
ధ్యానంతో దర్జాగా ఆరోగ్యం
దీర్ఘకాలిక వ్యాధులు, చెడు వ్యసనాలు మటుమాయం
యోగాశ్రమాలకు, ప్రకృతి వైద్యానికి పెరుగుతున్న ఆదరణ
ఆహారమే ఔషధం.. వంటిల్లే వైద్యశాల
ఖమ్మం : మనుషులకు ఏదైనా జబ్బు చేస్తే.. ఆ వ్యాధి బారి నుంచి బయట పడేందుకు ఆధునిక ఔషధాలు ఎన్ని తయారు చేస్తున్నా.. మరో కొత్త వ్యాధి పుట్టుకొస్తూనే ఉంది. కొన్ని జబ్బులు నిపుణులైన వైద్యులకే అంతుపట్టడం లేదు. పట్టుమని పదేళ్లు రాకముందే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. కానీ మన పూర్వీకులు సునాయాసంగా 100 సంవత్సరాలు బతికేవారు. పండు వయసులోనూ పల్లెం నిండా అన్నం తినేవారు.. పదిమైళ్లయినా అవలీలగా నడిచేవారు. వారి కంటి చూపు సన్నగిల్లలేదు.. పంటి నొప్పి రాలేదు.. వీటన్నింటికి కారణం.. ప్రకృతి.. ఆహారపు అలవాట్లే.. వంటగదే వైద్యశాలగా ఉండేది.. కలుషితం కాని ఆహార పదార్థాలు.. ఆకుకూరలు... ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు తినేవారు. కష్టపడి పనిచేసేవారు.. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు.
మరి ఇప్పుడు.. పదేళ్ల పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు, కాళ్ల నొప్పులు.. సన్నగిల్లిన కంటిచూపు.. మూడు మెట్లు ఎక్కితేనే ఆయాసం.. అందుకే ప్రకృతి వైపు పయనిద్దాం అంటోంది నేటి తరం. యోగాలు.. ఆసనాలు.. ప్రకృతి వైద్యంతో మంచి ఫలితాలు ఉంటున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమన దొరుకుతుందని చెపుతున్నారు. ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మన సొంతం. తమ చుట్టూ ఉన్న ఆకులు, అలాలు, మట్టి, నీరు, సూర్యరశ్మి, గాలిలోనే సర్వ రోగ నివారణ మందులు ఉన్నాయని.. వాటిని సక్రమ పద్ధతిలో వినియోగించుకుంటూ యోగా చేస్తే సంపూర్ణ ఆర్యోగవంతులుగా ఉండవ చ్చని పలువురు అంటున్నారు. దీంతో యోగాశ్రమాలు, ప్రకృతి వైద్యశాలలు జిల్లాలో నానాటికీ పెరుగుతున్నాయి.
ప్రకృతి వైద్యం గురించి ప్రపంచానికే చాటిచెప్పిన భారతీయులు..
ప్రాచీన కాలం నుంచే ప్రపంచ దేశాలకు దీటుగాా వర్తక వ్యాపారాలు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వైద్య రంగంలోనూ భారతీయులు ముందుండే వారని చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 2500-1800 సంవత్సరాల మధ్య విరసిల్లిన సింధూ నాగరికతలోనే భారతీయులు యోగా, ఆవిరి స్నానాలు ఆచరించినట్లు హరప్పా, మొహంజోదారో పట్టణాల్లో బయటపడిన ఆధారాలు చెపుతున్నాయి.
అలాగే చరకుడు రాసిన చరకసంహిత, గౌతమబుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు, కపిలుడు వంటివారు రాసిన గ్రంధాలతోపాటు క్రీస్తుపూర్వం 300-200 కాలంలో పతంజలి రాసిన యోగసూత్రలో తెలిపిన విషయాలు, ఆరోగ్య సూత్రాలు ప్రపంచాన్నే అబ్బుర పరిచాయి. మన పూర్వీకులు రాసిన గ్రంధాలు, వారు ఆచరించిన విధానాలను చైనా, జపాన్, బూటాన్, కంబోడియా, శ్రీలంక వంటి దేశాల ప్రజలు ఇప్పటికీ ఆచరించడం గమనార్హం. కాగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇటీవల ప్రకృతి చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆసనాలు, యోగాతో గల ప్రయోజనాలను తెలుకుంటున్నారు.
యోగాతో లాభాలేమిటి..?
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలని కోరుకుంటారు. మానసిక, శారీరక ఆనారోగ్యానికి యోగా, ప్రకృతి వైద్యంతో మంచి ఫలితాలు ఉంటాయని యోగా గురువులు అంటున్నారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఆహార నియమాలను సమన్వయం చేయడమే అన్ని రకాల సమస్యలకు పరిష్కారమని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, థైరాయిడ్, పక్షవాతం, గుండెజబ్బులు, నరాల బలహీనత, మొలలు, గ్రంధుల సంబంధిత వ్యాధులు ప్రకృతి వైద్యంతో నయం చేయవచ్చంటున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని చెపుతున్నారు. అవయవాల నియంత్రణ లోపం, అహారపు అలవాట్లలో తేడాల వల్లే వ్యాధులు వస్తుంటాయని, వీటి నుంచి విముక్తి పొందేందుకు కండరాలు, అవయవాల్లో కదలిక తేవడానికి యోగా ఉపకరిస్తుందని అంటున్నారు.
ప్రకృతి వైద్యం వైపు పయనం
ఇంగ్లిష్ మందులు వేసుకుని విసిగిపోయిన వారు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పయనిస్తున్నారు. దంపుడు బియ్యం, పచ్చి కూరగాయలు తినడంతో పాటు అన్ని రకాల ఔషధ మొక్కలను ఇంటి ఆవరణలో, పెరట్లో పెంచుతున్నారు. పూదిన, కొత్తిమీర, తులసి ఆకు, బొప్పాయి వంటివి స్త్రీల సంబంధింత వ్యాధులకు బాగా పని చేస్తాయని యోగా నిపుణులు అంటున్నారు.
అలాగే అల్సర్‌కు కలమంద రసం, బీపీకి టమాటా జ్యూస్, రక్తహీనత, క్యాన్షర్, నరాల బలహీనతలకు గోదుమగడ్డి రసం, ఎముకల అరుగుదల నివారణకు నువ్వులు, తోటకూర, ఖర్జూరా, తమలపాకు, కిడ్నీలో రాళ్లు కరిగించుటకు కొండపిండి ఆకు చూర్ణం, బొప్పాయి, ఉలువచారు.. ఇలా ప్రతీ వ్యాధికి ప్రకృతి వైద్యం ఉందని వారు వివరిస్తున్నారు.
జిల్లాలో రోజూ లక్షమందికి పైగా యోగా..
జిల్లాలో పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకు యోగా వేసేవారు రోజుకు లక్ష మందికి పైగానే ఉంటారని ఆయా కేంద్రాల నిర్వాహకులు చెపుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, మధిర.. ఇలా అన్ని ప్రాంతాల్లో యోగా కేంద్రాలు, ఇతర ఆశ్రమాలు, ధ్యాన మందిరాలు 200 పైగా ఉన్నాయి. వీటిలో యోగా, ప్రకృతి వైద్య నియమాలు తెలుసుకున్నవారు స్వయంగా ఇళ్లలో వేయడంతో పాటు ఇతర కుటుంబసభ్యులకు కూడా నేర్పుతున్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగా, ప్రకృతి వైద్యం మనపూర్వీకుల నుంచి సక్రమించిన వరం. ఆలస్యంగానైనా మన జిల్లాలో యోగా పట్ల ప్రజలకు ఆసక్తి పెరగడం సంతోషకరం. యోగా వేస్తూ, ప్రకృతి నియమాలు పాటించి, ఆహారపు అలవాట్లలో మెలకువలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది.
- కె.వై. రామచంద్రరావు, ప్రకృతి వైద్యులు