కంతనపల్లి, ప్రాణహిత సంగతేంటో!
⇒ పర్యావరణ, అటవీ సమస్యల నుంచి గట్టేక్కేనా..
⇒ మార్చిలో ఏఈసీ కమిటీ ముందు ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసిన నేపథ్యంలో.. ఇదే అంశంతో ముడిపడి ఉన్న ఇతర ప్రాజెక్టులపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుం దన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టుల పర్యా వరణ అంశాలపై కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆందోళన నెలకొంది. కాళేశ్వరం మాదిరే వ్యవహరిస్తే ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మాదిరే ప్రాణహిత, కంతనపల్లి లోనూ భారీగా భూసేకరణ, అటవీ భూమి అవసరాలున్నాయి.
ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలో 3,900 ఎకరాల భూసేకరణ అవస రం కానుండగా, 2,671.32 ఎకరాల అటవీ భూమి అవసరం ఉంది. ఇక కంతనపల్లి పరిధిలోనూ 90 ఎకరాల అటవీ భూమి అవసరంతో పాటు 1500 ఎకరాల భూమి ముంపునకు గురౌతోంది. వీటన్నింటికీ సం బంధించి కేంద్ర పర్యావరణ శాఖ ముందు ప్రజెంటేషన్ చేస్తేనే టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఖరారు చేస్తుంది. ఈ టీఓఆర్‌కు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేది కను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ టీఓఆర్ ప్రక్రియను మూడు దఫాలుగా చేయాల్సి ఉంటుంది.
ఒకటి వర్షా కాలానికి ముందు, వర్షాకాలం, వర్షా కాలం ముగిసిన అనంతరం వేర్వేరు పరిస్థితుల్లో పర్యావరణ మదింపు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం టీఓఆర్‌కు ఓకే చేస్తే మూడు సీజన్ల అధ్యయన వివరాలతో నీటి పారుదల శాఖ నివేదిస్తుంది. ఒకవేళ కేంద్ర జల సంఘం కొత్తగా తెచ్చిన మార్గదర్శకాలను సాకుగా చూపి టీఓఆర్‌కు అనుమతి ఇవ్వని పక్షంలో మళ్లీ కొత్తగా ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారంటూ కొం దరు వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునళ్లకు వెళుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2న ప్రాణహితపై, మార్చి 3న కంతనపల్లి పర్యావరణ మదింపు ప్రక్రియపై ఈఏసీ భేటీలు నిర్వహిస్తోంది.
ప్రాణహిత అటవీ భూమికి వైల్డ్ లైఫ్ బోర్డు ఓకే
కాగా ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 622.0126 హెక్టార్ల అటవీ భూమిని నీటి పారుదల శాఖ పరిధిలోని మార్చేందుకు రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ప్రాజెక్టు కోసం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతం, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రా వతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కలిపి మొత్తంగా 1081.0478 హెక్టార్ల అటవీ భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం కానుంది.
కాగా ఇందులో 622.0126 హెక్టార్ల అటవీ భూమిని బదలా యించేందుకు స్టేట్ బోర్డు ఓకే చేసింది. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండల శివరాంలో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం, ఇదే జిల్లా చెన్నూరు పరిధిలోని సోమన్ పల్లి ఎత్తిపోతల పథకాలకు అటవీ భూమి బదలాయింపులను తిరస్కరించింది.