రంది పడకుండ్రి.. ఆగమాగం కాకుండ్రి
ఇమాంబాద్ వాసులకు మంత్రి హరీశ్‌రావు భరోసా
రామాయంపేట: ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఊరు ముంపునకు గురవుతుందని, తమను ఆదుకోవాలని కంటతడి పెట్టిన సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామస్థులకు నేనున్నానని మంత్రి హరీశ్‌రావు భరో సా ఇచ్చి చెప్పి వారిని అక్కున చేర్చుకున్నారు. వివరాల్లోకి వెలితే.. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో తమ ఊరు ముంపునకు గురవుతుందనే భయంతో గ్రామస్థులు శుక్రవారం రామాయంపేటకు తరలివచ్చి మంత్రి హరీశ్‌రావు ఎదుట మొరపెట్టుకొని కంటతడి పెట్టారు. దీనితో చలించిపోయిన హరీశ్ ‘రంది పడకుండ్రి,- ఆగమాగం కాకుండ్రి’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తు 1.5 నుంచి 4 టీఎంసీల మేర పెంచితే సుమారుగా 40 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. చెప్పుడు మాటలు వినకుండ్రి, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
సింగూరు నీరంతా మెతుకుసీమకే
సింగూర్ ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా మెతుకు సీమకే వినియోగిస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. శుక్రవారం పాపన్నపేట మండలం బాచారంలోని గుండు వాగు, దౌలాపూర్‌లో పాపన్నపేట యేటి కాల్వ, ఏడుపాయల్లో ఘణపురం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతూ మెతుకు సీమలో పయనిస్తున్న మంజీరా నీటిని ఇకముందు జిల్లా వాసులకే వినియోగించే సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణ -1, కృష్ణ -2, గోదావరి జలాలను హైదరాబాద్‌కు మల్లించడంతో ఇక సింగూర్ నీటిని స్థానికంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట కోసం సుమారు కోటిరూపాయలు మంజూరుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తును 1.73మీటర్లకు పెంచుతామని తెలిపారు. ఫలితంగా మరో 5వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 30 యేళ్లుగా నానుతున్న గుండు వాగు, పాపన్నపేట యేటి కాల్వలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు నిధులు విడుదల చేసి పాపన్నపేట మండల రైతులకు మరిచిపోలేని ప్రయోజనం చేకూర్చారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ప్రసంగించారు.
కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి
చిన్నశంకరంపేటః ఓకే రోజు వంద శాతం ఇంకుడు గుంత లు నిర్మించిన కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకుని మిగత గ్రామాలు ముందుకుసాగాలని మంత్రి హరీష్‌రావు కోరారు. శుక్రవారం చిన్నశంకరంపేట కొర్విపల్లిలో చేపట్టిన ఓకే రోజు వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ. 200 కోట్లతో గోదాముల నిర్మాణం
మెదక్: రాష్ట్రంలో రూ. 1,024 కోట్లతో 200 గోదాములు నిర్మిస్తుండగా, ఒక్క మెదక్ జిల్లాకే రూ. 200 కోట్ల కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని మార్కెట్‌లలో రైతుల అవసరాల మేరకు విశ్రాంత గృహాలు, కవర్ షెడ్‌ల నిర్మాణం, టాయిలెట్లు, క్యాంటీన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల నిరంతర విద్యుత్ పగటిపూట సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
కాళేశ్వరం డ్యామ్ నుంచి నీటిని మళ్లించే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల పాపం తోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 119 కోట్లు రాబోతున్నాయని, 2014-15లో రూ. 53 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.