మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కూతుళ్లు, బంధువులు
సాక్షి, సిద్దిపేట: ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి వక్రికరించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన అల్లుడు చితి వద్దే కుప్పకూలాడు. దీంతో రెండు ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురువారం నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన పండగ నారాయణ (65) సింగరేణి బొగ్గు గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు.
ఉపాధి కోసం సిద్దిపేటలో ప్రైవేట్ జాబ్ చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అస్వస్థకు గురై నారాయణ మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం బుద్దిపడగలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అతని అల్లుడు(కూతురు భర్త) తుపాకుల శ్రీధర్‌బాబు (36) చితి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమణించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌బాబు మృతి చెందినట్లు తెలిపారు. సిద్దిపేటలకు చెందిన శ్రీధర్‌బాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని భార్య సుజాత ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు లతిక, కీర్తికలున్నారు.
బుధవారం సుమోలో ముంబాయికి కిరాయకు వెళ్తుండగా అతని మామయ్య నారాయణ వార్త తెలియడంతో బుధవారం రాత్రి శ్రీధర్‌బాబు ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాటు చేశాడు. మామ మృతదేహాన్ని చితిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలసి చితి చుట్టూ తిరుగుతుండగా ఉన్నట్లుండి శ్రీధర్‌బాబు కిందపడిపోయాడు. ఒకేసారి తండ్రి, భర్త మరణించడంతో విలపిస్తున్న సుజాతను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ హృదయవిదారక ఘటనను అందరిని కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment