పదేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
శివాజీనగర్(దుగ్గొండి) : దేవాలయాల్లాంటి ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి ఊరి ప్రజలంతా ఒక్కటయ్యారు. దశాబ్దం క్రితం మూతపడిన పాఠశాల దుమ్ముదులిపి ఈ నెల 13న తెరిపించారు. శుక్రవారం మంచిరోజు కావడంతో గ్రామంలో ప్రతి విద్యార్థిని మండల అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఊరిబడిలో చేర్పించారు. మొదటి తరగతి గదిని తహసీల్దార్ రమాదేవి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు అధికారులు పలకలు, పుస్తకాలతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కుక్కముడి సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు సుకినె రజిత, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రావు, ఎంఈఓ ప్రశాంత్, ఈఓపీఆర్‌డీ ఖాజామైనొద్దిన్, సర్పంచ్ మంద లక్ష్మి, సుకినె రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఊరి బడి దేవాలయం : ఏజేసీ తిరుపతిరావు
ఊరి బడి గ్రామస్తులందరికి అక్షర దేవాలయమని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. దానిని పవిత్రంగా భావించి విద్యార్థులందరిని ఊరిబడికే పంపాలన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. చిన్నారులందరితో స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. తమ పిల్లలను ఊరిబడికి పంపిస్తున్న తల్లిదండ్రులను శాలువాలు, పూలమాలలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంఓ మనోజ్‌కుమార్, హెచ్‌ఎం గట్టు జీవన్‌కుమార్, సర్పంచ్ బొమ్మెన లక్ష్మీశోభన్, సీఆర్‌పీ రమేష్‌బాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.