కరువు పరిస్థితులను అంచనా వేసినప్రభుత్వం 2011లో జిల్లాకు రూ.258.75 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది.
పంట నష్ట పరిహారంగా జిల్లాకు విడుదలైన కోట్లాది రూపాయల లెక్క తేలడం లేదు. రూ. 229 కోట్లు పంపిణీకి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ)మూడేళ్లుగా సమర్పించలేదు. రూ.63 కోట్లకు సంబంధించి గందరగోళం నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు సంయుక్తంగా కుస్తీ పడుతున్నా కసరత్తు ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచన కనిపించడం లేదు. పరిహారం పంపిణీ సందర్భంగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో లెక్కలు తేలకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కరువు పరిస్థితులను అంచనా వేసినప్రభుత్వం 2011లో జిల్లాకు రూ.258.75 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. పంట నష్ట పోయిన 8.40లక్షల మంది రైతులకు పరిహారం పంపిణీ చేసే బాధ్యతను వ్యవసాయ శాఖకు అప్పగించింది. ఒక్కో హెక్టారుకు రూ.6 వేల చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పంట నష్టపోయిన రైతుల జాబితాను రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా రూపొందించాయి. మంజూరు చేసిన మొత్తంలో రూ.229 కోట్లను ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జిల్లాకు బదలాయించింది.
పరిహారం పంపిణీ బాధ్యతను జిల్లాలో 29 బ్యాంకులకు అప్పగించడంతో విడతల వారీగా మంజూరైన మొత్తాన్ని అధికారులు 149 బిల్లుల ద్వారా బ్యాం కుల ఖాతాల్లో జమ చేశారు. ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీల పరిధిలో ఎక్కువమంది రైతులకు ఖాతాలుండటంతో ఆయా బ్యాంకుల ఖాతాల్లోకే ఎక్కువ డబ్బు వెళ్లింది. అయితే బ్యాం కుల ద్వారా ఎంత మంది రైతులకు, ఎంత మొత్తం చెల్లించారనే లెక్కలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) వ్యవసాయ శాఖ వద్ద లేవు. దీంతో రైతులకు చేరినదెంత, బ్యాంకుల వద్ద పంపిణీ కాకుండా మిగిలినదెంత అనే లెక్కలు తేలక వ్యవసాయాధికారులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
లెక్క తేలని రూ.63 కోట్లు
పరిహారంగా విడుదలైన మొత్తంలో పంపిణీ కాకుండా మిగిలిన రూ. 11కోట్లలో రూ.8.93 కోట్లు ప్రభుత్వ ఖాతాకు తిరిగి చెల్లించారు. అయి తే ఈ మొత్తానికి సంబంధించిన వివరాలు మాత్రం నేటికీ ప్రభుత్వానికి సమర్పించలేదు. ట్రెజరీ ద్వారా విడుదలైన రూ.63 కోట్లకు ఎలాంటి లెక్కా పత్రం లేకుండా పోయింది. ఈ మొత్తం రైతులకు చేరిందా, బ్యాంకుల వద్దే ఖాతాల్లో ఉందా అనే వివరాలు సేకరించడం వ్యవసాయ శాఖకు ప్రస్తుతం తలకు మించిన భారంగా పరిణమించింది. ఉదాహరణకు బాలానగర్ మండలంలోని రైతులకు వివిధ బ్యాంకుల కు చెందిన 108బ్రాంచిల ద్వారా పరిహారం చెల్లించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒక్కో బ్రాంచి వారీగా వివరాలు సేకరించడంలో అధికారులు తలమునకలయ్యారు.
చాలాచోట్ల బ్యాంకుల ఖాతాలకు డబ్బులు విడుదల చేసినా లబ్ధిదారుల జాబితా ఇవ్వకపోవడంతో పంపిణీ జరగలేదని సమాచారం. కొన్నిచోట్ల లబ్ధిదారుల ఖాతాలు, చెల్లించిన మొత్తానికి కూడా పొంతన కుదరడం లేదు. వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు బ్యాంకులు, బ్రాంచ్‌ల వారీగా లెక్కలు తేల్చే పనిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ భగవత్ స్వరూప్ ‘సాక్షి’కి వెల్లడించారు.