కొలువుదీరిన ఎంపీపీలు.... ఆమే అధికం | aggravated the ladies in mpp elections | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన ఎంపీపీలు.... ఆమే అధికం

Published Thu, Aug 7 2014 1:51 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

aggravated the ladies in mpp elections

సాక్షి, ఖమ్మం: ఎట్టకేలకు మండలాలకు కొత్త పాలకులు వచ్చేశారు. ఎంపీపీ పదవులను దక్కించుకోవడంలో ఎవరి బలాబలాలు ఏంటో తేలిపోయింది. క్యాంపులు, ఎత్తులు, పై ఎత్తులు, బేరసారాలు కొనసాగినప్పటికీ.. చివరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. 36 మండలాల్లో బుధవారం ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా అందులో 25 స్థానాలను మహిళలే దక్కించుకోవడం విశేషం.

మొత్తం 39 మండలాలకు గాను కోరం లేక, కోఅప్షన్ సభ్యుల ఎన్నిక జరగక కొత్తగూడెం, పాల్వంచ, రఘునాథపాలెంలలో ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 36 మండలాల్లో 17 టీడీపీ, 6 కాంగ్రెస్, సీపీఎం 5, వైఎస్సార్‌సీపీ 2, సీపీఐ 2, ఎన్డీ 2, స్వతంత్ర అభ్యర్థులు 2 ఎంపీపీలను దక్కించుకున్నారు.

 ఎంపీపీ ఎన్నికల్లో తొలుత కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఆతర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరిగింది. అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల కోసం పోటీ పడ్డారు. క్యాంపు రాజకీయాలు, ఎత్తులు.. పైఎత్తులు ఫలించడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఉత్కంఠ మధ్య పదవులు కైవసం చేసుకున్నారు. ఇక ఉపాధ్యక్షులుగా టీడీపీ 16, కాంగ్రెస్2, సీపీఎం 5, వైఎస్సార్ సీపీ 8, సీపీఐ 2, ఎన్డీ 2, స్వతంత్ర అభ్యర్థులు ఒకరు దక్కించుకున్నారు.

 కల్లూరు మండలంలోని 18 ఎంపీటీసీల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ బలం సమానంగా ఉండడంతో టాస్ వేయగా, టీడీపీ అభ్యర్థి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ ఎంపీపీ స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇల్లెందు నియోజకవర్గంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా పోటీ పడ్డాయి. ఇల్లెందు ఎంపీపీ పీఠాన్ని సీపీఐ మద్దతుతో రాయలవర్గం కైవసం చేసుకుంది. బయ్యారం మండలంలో చంద్రన్న వర్గం ఎంపీపీకి తన అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే రాయలవర్గం, కాంగ్రెస్, టీడీపీ కూటమిగా తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. బలాబలాలు సమానంగా ఉండడంతో ఇక్కడ కూడా టాస్ వేయగా, రాయలవర్గం కూటమికి ఎంపీపీ పీఠం దక్కింది. ఇక ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం ఎంపీపీలను సీపీఎం తన ఖాతాలో వేసుకుంది.

 నేడు కొత్తగూడెం, పాల్వంచ ఎన్నికలు..
 కొత్తగూడెం మండల పరిషత్‌కు తొలుత కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్లు వేశారు. అయితే ఎంపీపీ ఎన్నికకు కోరం లేకపోవడంతో ఎన్నికను నిలిపివేశారు. అలాగే పాల్వంచ మండల పరిషత్‌లో నిర్దేశించిన గడువులో కో అప్షన్ సభ్యుని ఎన్నికకు ఎవ రూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ పరిస్థితితో ఇక్కడా  ఎంపీపీ ఎన్నిక నిలిచింది. ఈ రెండు చోట్ల గురువారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

రఘునాథపాలెం మండల పరిషత్‌కు కో అప్షన్ సభ్యులుగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎంపీపీ ఎన్నిక నిలిచిపోయింది. ఇక్కడ జరిగిన పరిణామాలపై ఈసీకి ఫ్యాక్స్ ద్వారా తెలియజేశామని, కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రఘునాథపాలెం మండల ఎన్నికల అధికారి వేణుమనోహర్ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement