- అక్రమ విద్యుత్‌కనెక్షన్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
- క్రమబద్ధీకరణకు దరఖాస్తుల వెల్లువ
- డీడీల రూపంలో సొమ్ము చెల్లిస్తున్న రైతులు
- నాలుగేళ్ల తర్వాత కొత్త దరఖాస్తుల స్వీకరణకు అనుమతి
- జిల్లాలో 30వేలకు పైగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు
మోర్తాడ్: వ్యవసాయానికి సంబంధించి అక్రమంగా కొనసాగుతున్న విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌పీడీసీఎల్) యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కనెక్షన్లను క్రమబద్ధీకరించేందుకు రైతులు పోటీపడుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలు తక్కువగా ఉన్న రీత్యా అనేక గ్రామాల్లో నాలుగేళ్లుగా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడాన్ని ఎన్‌పీడీసీఎల్ నిషేధించింది.
దీంతో రైతులు వ్యవసాయం కోసం అధికారుల అనుమతి పొందకుండా కనెక్షన్లను ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ శాఖ రికార్డుల్లో ఉన్న కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణీత పరిమాణంలోనే విద్యుత్‌ను సరఫరా చేశారు. అక్రమ కనెక్షన్ల వల్ల విద్యుత్ లోడ్ ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లో వోల్టేజీ ఏర్పడం జరిగింది. అయితే రైతులు ఏర్పాటు చేసుకున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించడం వివిధ కారణాల వల్ల అధికారులకు సాధ్యం కాలేదు.
దీంతో అక్రమ విద్యుత్ కనెక్షన్లు యధావిధిగా కొనసాగాయి. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నేపథ్యంలో అక్రమంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరణ చేయడానికి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గడచిన మార్చి నెల నుంచి అక్రమ విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల విద్యుత్ కనెక్షన్లకు రైతులు అనుమతి పొంది ఉన్నారు.
కాగా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కనెక్షన్లు 30వేల నుంచి 40వేల వరకు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. కొత్త కనెక్షన్లు ఇవ్వడంపై నిషేధం అమలులో ఉన్న కారణంగానే అక్రమ విద్యుత్ కనెక్షన్లు కొనసాగుతున్నాయని ఎన్‌పీడీసీఎల్ యాజమాన్యం గుర్తిం చింది. అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరణ చేస్తే విద్యుత్ వినియోగంపై స్పష్టత ఏర్పడుతుంది.
అంతేకాక విద్యుత్ సంస్థకు ఆదాయం లభిస్తుందని భావించిన ఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు దరఖాస్తులను స్వీకరించడానికి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న రైతులు క్రమబద్ధీకరణకు సంబంధించి బ్యాంకుల్లో డీడీలు చెల్లించి దరఖాస్తులు ఇవ్వాలని విద్యుత్ అధికారులు ప్రచారం చేయడంతో రైతులు బ్యాంకులకు, విద్యుత్ కార్యాలయాల్లో క్యూ కట్టారు.
ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 20వేల విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను రైతులు అందచేశారు. గడువు పొడిగించడంతో దాదాపు అన్ని అక్రమ విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరణ చేయడానికి రైతులు దరఖాస్తులను అందిస్తారని అధికారులు ఆశిస్తున్నారు. ఎక్కువగా ఆర్మూర్ డివిజన్‌లోనే క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అధికారులకు అందుతున్నాయి.
అక్రమం.. ఇక సక్రమమే
Published Mon, Apr 20 2015 4:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement