క్లాస్ రూమ్‌లోకి వస్తున్న భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ శర్మన్‌సింగ్
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల (ఎయిమ్స్) మంగళవారం ప్రారంభమైంది. భోపా ల్ ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్ శర్మన్ సింగ్ సాదాసీదాగా ప్రారంభ కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం విద్యార్థులకు మొదటి రోజు ఓరియెంటేషన్ క్లాస్‌ను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రులు, ఫ్యాకల్టీతో కలసి పరిచయ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో 50 మంది ఏంబీబీఎస్ విద్యార్థులు చేరగా 20 మంది ఫ్యాకల్టీని నియమించారు.
కళాశాలలోని అనాటమీ, ఫిజి యోలజీ, బయోకెమిస్ట్రీ, సామాజిక, కుటుంబ వైద్య విభాగాలతోపాటు హిస్టాలాజీ, అడ్మిన్ లా కార్యాలయం, డీయెన్, వీఐపీ లాంజ్, క్యాంటిన్‌లను ప్రారంభించారు. వైద్య రంగ పరిశోధన, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించేలా ప్రత్యేకమైన హాల్స్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఏంబీబీఎస్ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ శర్మన్ సింగ్ తెలిపారు.
ప్రారంభోత్సవంలో గందరగోళం..
కళాశాల ప్రారంభోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎయిమ్స్ అధికారులు, ఫ్యాకల్టీకి తప్పా ప్రజా ప్రతినిధులకు, ఇతరులకు ఆహ్వానం లేదు. అయితే టీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ నాయకులు ఎయిమ్స్ భవనంలోకి పెద్ద ఎత్తున రావడం, పరిచయ వేదికలో ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవడంతో కొంత గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment