సర్జిపూల్‌లోకి దిగుతున్న గజ ఈతగాళ్లు
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌లో షట్టర్స్ వద్ద ఏర్పడిన ఎయిర్‌గ్యాప్ లీకేజీలను విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు సరిచేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని వేంనూర్ జీరో పాయింట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా టన్నెల్ నుంచి తరలించి మేడారం సర్జిపూల్‌ను నింపారు. సర్జిపూల్ పూర్తి కెపాసిటీ 37 మీటర్లు కాగా 19 మీటర్ల వరకు నీటితో నింపారు. జీరోపాయింట్ నుం చి సర్జిపూల్ వరకు సమస్యలు లేకుండా నీరు చేరింది. సర్జిపూల్ వద్ద ఏర్పాటు చేసిన 7 మోటార్ల వద్ద ఎయిర్‌గ్యాప్‌లు ఏర్పడి లీకేజీ అవుతోంది. దీనిని గమనించిన ఇంజనీరింగ్ అధికారులు విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు అయిన నిపుణులతో లీకేజీలు సరిచేస్తున్నారు.
24న వెట్ రన్ : ఈఈ శ్రీధర్
ఈ నెల 24న సర్జిపూల్ మోటార్లతో వెట్‌రన్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. జీరో పాయింట్ నుంచి సర్జిపూల్ వరకు సక్రమంగానే ఉందన్నారు. 24న ఉదయం మొదటి పంప్ ద్వారా వెట్‌రన్ చేసిన తరువాత, సాయంత్రం రెండోపంప్ ద్వారా వెట్‌రన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం
నీటి కిందిభాగంలో పనులు చేస్తున్న క్రమంలో ఈతగాళ్లకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. నీటిలోకి దిగే మాస్కులు ధరిస్తాం. ఆక్సిజన్ సిలిండర్ వినియోగిస్తాం.
– అక్షిత్, గజ ఈతగాళ్ల ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment