సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఇక మాస్క్ లేకుండా బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుందా...వాయు కాలుష్య తీవ్రతకు గట్టిగా గాలి పీల్చాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందా.ఈ పరిణామాలన్నీ గుండె జబ్బులకు దారి తీస్తాయా...అంటే అవుననే అంటోంది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్)తాజా అధ్యయనం. ప్రధానంగా సూక్ష్మధూళి కణాల కాలుష్యం గుండె, ఊపిరితిత్తులకు పొగ పెడుతోంది. మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల (పిఎం 2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజనుల గుండె కండరాలు,ధమనులు దెబ్బ తింటున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నగరంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగానమోదు అవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ ధమనులు, కెరోటిడ్ ఇంటి మా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదదితర హృదయ సంబందిత సమస్యలు క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఇక 40 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల్లో 2.47 శాతం మందికి గుండె సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపింది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం.
గ్రేటర్‌లో ధూళికాలుష్యానికి కారణాలివే..
♦ పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజనుల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
♦ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి.
♦ శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మ ధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజనుల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి.
♦ ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.
♦ బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది.
♦ ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు బయటపడడం గమనార్హం.
♦ బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉధృతి అధికంగా ఉన్నట్లు తేలింది. u గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 55 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. u గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. u వాహనాల సంఖ్య లక్షలు దాటినా..గ్రేటర్‌లో 9 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 17 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. u దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.
జాగ్రత్తలు ఇవే..
♦ సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్క్‌లు ధరించాలి. u కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి. u ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్త పడాలి.
♦ కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి.
పలు చోట్ల వంద మైక్రోగ్రాములకు మించినధూళి కాలుష్యం...
కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు.
ప్రాంతం ధూళి కాలుష్యం
ఆబిడ్స్ 92
నాచారం 89
జీడిమెట్ల 89
చార్మినార్ 84
పంజగుట్ట 82
జూపార్క్ 79
హెచ్‌సీయూ 76
ప్యారడైజ్ 72
చిక్కడపల్లి 71
కూకట్‌పల్లి 70
సైనిక్‌పురి 69
ఎంజీబీఎస్ 69
బాలానగర్ 68
ఉప్పల్ 67
లంగర్‌హౌజ్ 66
జూబ్లీహిల్స్ 61
ట్యాంక్‌బండ్ 61
కేబీఆర్‌పార్క్ 54
మాదాపూర్ 50
రాజేంద్రనగర్ 41
పరిమితి: ఘనపు మీటరు గాలిలో60 మైక్రోగ్రాములుమించరాదు.
Comments
Please login to add a commentAdd a comment