
శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య అన్నారు. శ్రీరాంపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కార్మికులను వారసత్వ ఉద్యోగాల పేరుతో నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటిదాకా వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నేడు కారుణ్య నియామకాలు చేపడతామని ప్రకటన చేశారన్నారు. కార్మికుడు చనిపోయినా, మెడికల్ అన్‌ఫిట్ అయితే అతడి స్థానంలో డిపెండెంట్‌కు ఉద్యోగం ఇచ్చే విధానాన్నే కారుణ్య నియామకాలంటారని, ఇది సింగరేణిలో అమలవుతోందన్నారు. షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇపుడు మాట మార్చుతున్నారని అన్నారు.
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది జాతీయ సంఘాలని, 1998, 2002లో జరిగిన ఒప్పందాల వల్లే ఇది జరిగిందంటున్న కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. 1998 టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్, కేబినెట్ నిర్ణయాల్లో భాగస్వామ్యంగా ఉన్న సంగతి మరిచిపోతున్నారని అన్నారు. దీపావళి బోనస్ కూడా తానే ఇప్పించానని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. కార్మికులు మోసపూరిత మాటలు నమ్మకుండా ఏఐటీయూసీని గెలిపించాలన్నారు.