ఇప్పుడేం చేయాలి?
- గడువు ముగియడంతో సందిగ్ధంలో ఏకే బజాజ్ కమిటీ
- స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జల వివాదాల పరి ష్కారానికి వీలుగా కేంద్రం నియమించిన ఏకే బజాజ్ కమిటీ సందిగ్ధంతో పడింది. కేంద్రం విధించిన 90 రోజుల గడువు ముగియడం, నివేదిక ఇచ్చేందుకు తమ వద్ద తగిన సమాచారం లేకపోవడం కమిటీని ఇరకాటంలో పడేసింది. ఈ నేపథ్యంలో తమ కమిటీ కొనసాగుతున్నట్లా.. లేనట్లా? కొనసాగితే తాము ఎలా నివేదిక ఇవ్వాలన్న సందేహాలను తీర్చుకునేందుకు సోమవారం జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌తో బజాజ్ కమిటీ సభ్య కార్యదర్శి ఎన్‌ఎన్ రాయ్ భేటీ అయ్యారు.
ఏమీ తేల్చలేదు
తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై మార్గదర్శకాలు రూపొందించాలని, గోదావరి అవార్డుకు అనుగుణంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఈ మేరకు బజాజ్ కమిటీ తెలంగాణ, ఏపీల్లో పర్యటించి, పలు ప్రాజెక్టులను పరిశీలించింది. అధికారులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు, సమాచారాన్ని సేకరించింది.
ఇంతలోనే కమిటీ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌తో బజాజ్ కమిటీ సభ్య కార్యదర్శి ఎన్‌ఎన్ రాయ్ భేటీ అయ్యారు. తగిన సమాచారం లభ్యం కానందున నివేదిక ఇవ్వలేమన్నారు. దీంతో అమర్‌జీత్‌సింగ్ తెలంగాణ నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషికి లేఖ రాశారు. కమిటీ కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు.